30-08-2025 10:22:36 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): గంజాయి, డ్రగ్స్, ఆల్ఫాజోలోమ్ వంటి మత్తు పదార్థాలు వినియోగించిన, రవాణా చేసిన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలోని విసి చాంబర్లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతను మత్తు బారిన పడనివ్వకుండా మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైతే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను కూడా ప్రయోగించేందుకు వెనుకాడేది లేదన్నారు. రెండు నెలలుగా జిల్లా ఎక్సైజ్, పోలీస్ శాఖలు నిర్వహించిన దాడుల వివరాలు, పట్టుబడిన గంజాయి, అల్ప్రాజోలమ్ వంటి మత్తు పదార్థాలు, నమోదైన కేసులపై అధికారులు వివరించారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలలో చైతన్యం కలిగించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఆంటీ డ్రగ్ కమిటీలు క్రియాశీలకంగా పనిచేయాలని, అవి పూర్తిస్థాయిలో ఫంక్షన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో 100 మీటర్ల దూరంలో సిగరెట్లు, గుట్కాలు వంటి పదార్థాల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్తు పదార్థాల వల్ల యువత ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతున్నందున, దీని నియంత్రణ అత్యవసరమని అన్నారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు, పోలీస్, ఎక్సైజ్, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.