13-09-2025 01:30:27 AM
జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 12(విజయక్రాంతి)ః జగిత్యాల జిల్లాలో తోటి మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పెగడపల్లి తహసీల్దార్ రవీందర్‌పై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పోలీసులు తహసీల్దార్‌పై కేసు నమోదు చేశారు. విధుల్లో భాగంగా గత నాలుగు రోజులుగా తహసీల్దార్‌తో కలిసి పనిచేసిన ఓ మహిళా ఉద్యోగిని తన వాహనంలో ఎక్కించుకొని పట్టణ శివారులో తిప్పడం, వాట్సాప్‌లో అసభ్యకరంగా మెసెజ్‌లు చేయడం, కాల్స్ చేసి వేధించడం లాంటి చర్యలకు పాల్పడడంతో తహసీల్దార రవీందర్‌పై మహిళా ఉద్యోగి జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ విషయం తెలుసుకున్న పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ జగిత్యాలకు చెందిన మరో తహసీల్దార్ ద్వారా రాజీ కుదుర్చుకునే ప్రయత్నంచేశారు. కాళ్లు మొక్కిసా వదిలేయాలని, ఎవరికి ఫిర్యాదు చేయకుండా రాజీ కుదుర్చుకోవాలని మహిళా ఉద్యోగిపై రకరకాల ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ బాధితురాలు వినకపోవడంతో రాజీ ప్రయత్నం విఫలమైంది.
దీంతో మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి తహసీల్దార్ రవీందర్‌ను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఫస్ట్ క్లాస్ మెజిస్రేట్ స్థానంలో మండల స్థాయిలో గౌరవ ప్రదమైన అధికారిగా ఉన్న వ్యక్తి తోటి ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి అరెస్టు అవ్వడం జిల్లాలో సంచలనంగా మారింది.