12-07-2025 01:25:43 AM
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
గద్వాల, జూలై 11 ( విజయక్రాంతి ) : పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు భూ భారతి,రేషన్ కార్డుల ధృవీకరణ, మీ - సేవ దరఖాస్తులు, ఎఫ్-లైన్ పిటిషన్లపై అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి ద్వారా భూమి వివాదాలు తగ్గి,రైతులకు, భూ యజమానులకు శాశ్వత న్యాయం జరగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.భూమి సమస్యలపై ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, రెవిన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని దరఖాస్తులపై తదుపరి చర్యలకు ముందు త్వరితగతిన నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
అసైన్మెంట్ భూముల సమస్యలను పూర్తిగా పరిశీలించి,నివేదికను సమర్పించాలని అన్నారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని అన్నారు.ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తులను వెంటనే పూర్తిచేసి,అదనపు కుటుంబ సభ్యుల చేర్పు,అనర్హుల తొలగింపు ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని అన్నారు.
మీ సేవ దరఖాస్తులు,ఎఫ్-లైన్ పిటిషన్లు కొన్ని నిర్ణీత కాల పరిమితిని మించి పెండింగ్లో ఉన్న,వాటిని అత్యవసరంగా పూర్తిచేసి ప్రజలకు ఆలస్యం లేకుండా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్,సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఏడీ రామ్ చందర్,అన్ని మండల తహసీల్దార్లు,తదితరులు పాల్గొన్నారు.