15-09-2025 01:04:44 AM
ఇల్లందు టౌన్, సెప్టెంబర్ 14, (విజయక్రాంతి) :గత మూడు రోజులుగా గిరిజన సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేస్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు చెల్లించాలని పట్టణంలోని సంక్షేమ హాస్టల్స్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న వర్కర్లకు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉమ్మగాని హరీష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్లు 9 నెలల జీతాలు పెండింగ్ ఉండడంతో బ్రతకలేని పరిస్థితిలో సమ్మెకు కూర్చున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో రూ.16వేలు ఉండే డైలీ వేజ్ వర్కర్స్ జీతాన్ని నేటి రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేలకు తగ్గించడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కనీస వేతనం రూ.26వేలు అమలు చేయకపోగా తిరిగి వారి జీతభత్యాలు తగ్గించడం సమంజసం కాదన్నారు. అదేవిధంగా విద్యార్థులు లోపల వంట చేసేవాళ్ళు లేకపోవడంతో విద్యార్థులే స్వయంగా వంటలు చేసుకుని తినే పరిస్థితి నెలకొందని శనివారం ఆదివారం సెల ఎన్వు కావడంతో విద్యార్థులు ఉదయం 11గంటలకు టిఫిన్ తినడం జరిగిందని మధ్యాహ్నం భోజనం అయితే 4గంటలకు తింటున్నారని స్వయంగా విద్యార్థులు వండుకొని తినే పరిస్థితి నేడు సంక్షేమ హాస్టల్లో నెలకొందన్నారు.
వంట వండే క్రమంలో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ పీవో బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో రేపటి నుండి ఉద్యమాన్ని మరింత ఉధృతి చేయవలసి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఇల్లందు మండల కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ యాకేష్, నిఖిల్, సాయి తదితరులుపాల్గొన్నారు.