calender_icon.png 24 July, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు నెలల్లో 27వేల మంది మృతి

24-07-2025 12:00:00 AM

  1. జాతీయ హైవేలపై పెరిగిన రోడ్డు ప్రమాదాలు
  2. రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
  3. మూడు జాతీయ రహదారులపై ఏటీఎంఎస్‌ల ఏర్పాటు

న్యూఢిల్లీ, జూలై 23: దేశంలోని జాతీయ రహదారులు మరణదారులుగా మారిపోతున్నాయి. గత ఆరు నెలల్లో దేశ వ్యాప్తంగా పలు జాతీయ హైవేలపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో  దాదాపు 27 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో ఈ మరణాలు నమోదైనట్టు పేర్కొన్నారు. బుధవారం రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానంతో వివరాలు వెల్లడించారు. 

2025 జనవరి నుంచి జూలై వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 26,770 మంది ప్రజలు మరణించినట్టు ధ్రువీకరించారు. 2024 ఏడాదిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా 52,609 మంది మరణించినట్టు వెల్లడించారు. రాష్ట్రాల ఆధీనంలోని ట్రాఫిక్ నిర్వహణ, డ్రైవింగ్ నియం త్రణ వ్యవస్థల బలహీనతలే ప్రధాన కారణాలని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను గుర్తించి అక్కడ బలమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించినట్టు చెప్పారు.

ప్రతి ప్రమాద ప్రాణం వెనుక ఒక కుటుంబ బాధ ఉంటుందని, ప్రాణహాని కేవలం గణాంకం మాత్రమే కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వే, ట్రాన్స్ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వే వంటి అధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న పలు జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్)లను ఏర్పాటు చేసిందన్నారు. ఈ ఏటీఎంఎస్‌ల ద్వారా హైవేలపై ట్రాఫిక్‌ను సమర్థంగా నిర్వహించడంతో పాటు భద్రతను పెంచి ప్రమాదాల నియంత్రణకు ఈ వ్యవస్థలు ఉపయోగపడుతున్నాయన్నారు. 

ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే వాహనాల రద్దీ, హైస్పీడ్ కారిడార్‌లపై కొత్త ప్రాజెక్టుల్లో ఏటీఎంఎస్‌ల ఏర్పాటు సాధారణ ప్రాజెక్టులో భాగంగానే ఉంటుందన్నారు. గత మూడేళ్లలో 1,12,561 కిలోమీటర్ల జాతీయ రహదారులకు రోడ్డు భద్రతా ఆడిట్  నిర్వహించామని మరో ప్రశ్నకు సమాధాన మిచ్చారు.