13-08-2025 07:01:06 PM
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ..
సిద్దిపేట క్రైమ్: వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా రాబోయే రెండు, మూడు రోజులు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ(Police Commissioner Anuradha) సూచించారు. అదేవిధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలసి సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లావాసులకు వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 నెంబర్ కు ఫోన్ చేస్తే, తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడుతామని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
జిల్లాలో మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున, హుస్నాబాద్ నుంచి వరంగల్ వెళ్లే రహదారిపై ప్రజలను అప్రమత్తం చేయాలని హుస్నాబాద్ పోలీసులకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతితో రోడ్లు ధ్వంసం అయినట్టయితే, రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ పొదలు, చెట్ల కొమ్మలు, స్టాపర్స్ పెట్టి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో పురాతన ఇండ్ల సమాచారం తెలుసుకుని, కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇళ్లల్లో ఉంటున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు, కుటుంబ సభ్యులను వాగులు, చెరువులు, కుంటలను తిలకించేందుకు తీసుకెళ్లవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, విద్యుత్ సరఫరాలో ఏదైనా లోపం ఉంటే ట్రాన్స్కో అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వరదలు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని కమిషనర్ పోలీసులకు సూచించారు.