27-09-2025 05:55:24 PM
అత్యవసరమైతే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలు పొందండి : ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరుతోందని. కాలి నడకన, వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జ ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దన్నారు.
నదులు, వాగులు, వంకల వద్దకు జాలర్లు, ప్రజలు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించారు. పశువులను కాయడానికి నదులు, వాగులు, వంకల పరిసర ప్రాంతాల దగ్గరకు వెళ్లకూడ దన్నారు. సాధ్యమైనంత వరకు అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయాలలో బయటకు రాకుండా ఉండడానికి ప్రయత్నించవలసిందిగా సూచించారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర శాఖలతో కలిసి ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు, చెరువులు, వాగులు, నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
జిల్లా పోలీస్ శాఖ తరపున 24×7 అందుబాటులో ఉండే విధంగా డిడిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. ప్రజలు ఎవరైనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసు సేవలను పొందాలని కోరారు. ప్రమాదాలు వాటిల్లకుండా పోలీసులు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.