17-11-2025 12:46:43 AM
ఇల్లెందులో పర్యటించిన పొంగులేటి
ఇల్లెందు, (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదం ప్రజా ప్రభుత్వానికి ఉందని అందులో భాగంగానే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలా భావించి ముందుకు సాగుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఇల్లెందులో సత్యనారాయణపురం నెంబర్ 2 బస్తి, ఎన్జీవోఎస్ కాలనీలో వంతెనలు, ఆర్ అండ్ ఆర్ కాలనీలో సిసి రోడ్లు జంక్షన్ అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వ కేంద్రం, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్నందునే ప్రజల మన్ననలు పొందుతున్నామని అందుకు తార్కాణమే జూబ్లీహిల్స్ ఫలితం అని పేర్కొన్నారు. ఇల్లందు అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అందులో భాగంగానే అధికంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ వైద్యశాలలో ఐ సి యు ఆపరేషన్ గది, వెయిటింగ్, హాల్ షెడ్ నిర్మాణానికి అంబులెన్స్ ఇవ్వాలని ఐటీడీఏ పిఓ రాహుల్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల్లో పనుల పురోగతి కనిపించాలని, ఇల్లందు వైద్యశాల గిరిజన పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్య బృందం కృషి చేయాలని తెలిపారు.
నూతన వంద పడకల వైద్యశాల నిర్మాణంలో సైతం త్వరితగతిన పూర్తి చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం వైద్యశాలలో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, పిఓ రాహుల్ ఎస్పీ రోహిత్ రాజు, ఆర్డిఓ మధు, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, డిసిహెచ్‌ఎస్ రవిబాబు, సూపరిండెంట్ డాక్టర్ హర్షవర్ధన్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు యదలపల్లి అనసూయా, నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, మండల రాము నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బందిపాల్గొన్నారు.