calender_icon.png 17 November, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం నా దోస్తే.. నన్నేం చేయలేరు!?

17-11-2025 12:00:00 AM

  1. మూడవ కల్లు డిపో నేత  ప్రగల్భాలు

అప్పుడు బీఆర్‌ఎస్ పేరు  చెప్పుకొని దందా 

రూ.3కోట్ల లెక్కలేవి రూ.50 లక్షల బకాయిల  చెల్లింపేది

బకాయిలు చెల్లించాకే లైసెన్స్ రెన్యువల్ చేయాలని డిమాండ్లు 

అదే న్యాయం అంటున్న సభ్యులు, కార్మికులు 

నిజామాబాద్, నవంబర్16 (విజయ క్రాంతి): ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా చిరకాల మిత్రుడు. యువజన కాంగ్రెస్ రోజుల నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి. ఇదిగో ఈ ఫోటో చూడండి. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను తలచుకుంటే ఎక్సైజ్ అధికారులు ఇక్కడి నుంచి మూట ముల్లె సర్దుకొని పోవాల్సిందే‘ అంటూ మూడవ కల్లు డిపోకు చెందిన ఓ ముఖ్య వ్యక్తి బహిరంగంగా ప్రగల్భాలు పలుకుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గమ్మత్తున విషయమేమిటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, ఇదే వ్యక్తి తాను బీఆర్‌ఎస్ సీనియర్ నేతనని, అప్పటి ముఖ్యమంత్రి కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకొంటూ గత కొన్నేళ్లుగా కల్లు దందాలో చెలరేగిపోయారు. ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రభుత్వం మారిందో, వెంటనే ఈయన కూడా రంగు మార్చేశారు.

‘నేను కాంగ్రెస్ సీనియర్ నేతను‘ అంటూ కొత్తగా రెచ్చిపోతున్నారు. ఇది గమనించిన గౌడ సోదరులు, ‘మనవాడు ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తున్నాడు, ఇతనితో జాగ్రత్త‘ అంటూ తమలో తాము జోకులు వేసుకోవడం కొసమెరుపు.

కార్మికుల కడుపు కొట్టి..  సంవత్సరాలుగా కోట్లు స్వాహా! 

కల్లు దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచిన రోజుల్లో, రోజుకు లక్షల్లో సంపాదన వచ్చినట్లు సమాచారం. కానీ, ఆ లాభాలు కార్మికులకు చేరలేదు. సదరు ముఖ్య నిర్వాహకుడు, తన సొంత ఖర్చుల కింద నెలకు సుమారు రూ. 2 లక్షల వరకు లేపేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ, తన కింద పనిచేసే కార్మికులకు మాత్రం డబ్బులు లేవంటూ నెలల తరబడి బకాయిలు పెట్టారు. డిపోలో ఒక్కొక్కరికి సుమారు రూ. 60 వేల వరకు బకాయి పడ్డాడంటే, సదరు నేత ఏ స్థాయిలో అవకతవకలకు పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. బకాయిల గురించి అడిగితే సరైన సమాధానం కూడా చెప్పేవారు కాదని కార్మికులు వాపోతున్నారు.

డిపో సీజ్.. ఇప్పుడు గుర్తొచ్చిన సభ్యులు 

ఇటీవల డిపో డైరెక్టర్ల మధ్య తలెత్తిన విభేదాలు, కొట్లాటలు, పోలీస్ కేసు వరకు వెళ్లడంతో అసలు వ్యవహారం రచ్చకెక్కింది. దీంతో ఎక్సైజ్ అధికారులు ఆలస్యంగా మేల్కొని డిపోను సీజ్ చేశారు. లైసెన్స్ రెన్యువల్ చేయడానికి నిరాకరించారు. డిపో తిరిగి తెరవాలంటే, కచ్చితంగా సర్వసభ్య సమావేశం పెట్టి, సభ్యులందరి సంతకాలు తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు.

అదే సమయంలో రూ.50లక్షల బకాయిలు, రూ.3కోట్ల లావాదేవీల లెక్కల సంగతి ఏం చేస్తారో చూడాలి. ఇన్నాళ్లూ సభ్యులను, వారి బకాయిలను, లావాదేవీలను గాలికొదిలేసిన ఈ నిర్వాహకులకు ఇప్పుడు ఒక్కసారిగా సభ్యుల ఇళ్లు, వారి సంతకాలు గుర్తొచ్చాయి. ఎక్సైజ్, కో-ఆపరేటివ్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే నామమాత్రపు సమావేశాలు పెట్టి, సభ్యుల ఇళ్లకు వెళ్లి, వారిని మభ్యపెట్టి, సంతకాలు సేకరించేందుకు తీవ్రంగా శ్రమ పడ్డారు. ఆపై  శనివారం ఎక్సైజ్ అధికారులను కలిసి లైసెన్స్ రెన్యువల్ కోసం ప్రయత్నించారు.

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ లైసెన్స్ రెన్యువల్ పెండింగ్లో పడింది. దీంతో రెన్యువల్ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో అధికారుల వ్యవహార తీరుపై, ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎలాగైనా తిరిగి డిపో తెరిచి, ఆపై అక్రమంగా పర్మిషన్ లేని కల్లు దుకాణాలు నడుపుతూ, కేవలం ముగ్గురు వ్యక్తులే లాభాలు పంచుకోవడమే వీరి అసలు లక్ష్యమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సీఎం నా మిత్రుడు‘ అనే ధీమాతోనే నిబంధనలకు పాతర వేసి, కార్మికుల పొట్టకొట్టి, మళ్లీ దందా మొదలుపెట్టాలని చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.