calender_icon.png 27 August, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2036 ఒలింపిక్స్ నిర్వహణకు పోటీ!

27-08-2025 01:16:46 AM

  1.   28న తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం
  2. హాజరు కానున్న సీఎం, ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయం సాధన దిశగా మరో అడుగు పడనుంది. 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు మనం కూడా పోటీపడాలనే అజెండాగా తెలంగాణ స్పోర్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం ఈనెల 28 నిర్వహించనున్నారు. సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, బోర్డు సభ్యులు పాల్గొననున్నారు. ఈనెల 28న ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని టీహెచ్‌ఆర్ లీలా హోటల్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

దీనికి సీఎం రేవంత్‌రెడ్డి, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కో చైర్మన్ ఉపాసన కొణిదెల, సభ్యులు డాక్టర్ సంజీవ్ గోయెంకా, కావ్యా మారన్, విటా దాని, సి.శశిధర్, ప్రముఖ క్రీడాకారులు అభినవ్ బింద్రా, పుల్లెల గోపీచంద్, భైచుంగ్ భూటియా, రవి కాంత్‌రెడ్డి, కపిల్‌దేవ్‌లు పాల్గొననున్నారు. దీని నిర్వహణను బి.వి.పాపారావు, ఇంజేటి శ్రీనివాస్‌లు చూస్తారు.

ఒలింపిక్స్‌కు సన్నద్ధత

2036 ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించడానికి పోటీ పడేలా.. క్రీడాస్థలాలు, స్టేడియాల ఏర్పాటుకు సన్నద్ధత, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం, వనరుల సమీకరణ తదితర అంశాలపై లోతుగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీలో భాగంగా తీసుకున్న చర్యలను సభ్యులు చర్చించనున్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్యాంపస్‌లు ఉన్న గచ్చిబౌలి, హకీంపేటలలో ఉన్న సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, స్పోర్ట్స్ సైన్స్ ల్యాబ్‌లపై చర్చిస్తారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ తదితర అంశాలపైకూడా చర్చిస్తారు. దీనితోపాటు పాఠశాలల స్థాయిలో ఒలింపిక్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంపై చర్చిస్తారు. 

అలాగే టీఈఎన్‌వీఐసీ, లాబరో యూనివర్సిటీ, కోచింగ్, శిక్షణ కోసం కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లతో ఎంవోయూ కుదుర్చుకోవడం, దీర్ఘకాలంపాటు స్థానికంగానేకాకుండా.. విదేశాల్లోనూ శిక్షణ ఇప్పించడంపై చర్చిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేలా వివిధ స్థాయిల్లో పోటీల నిర్వహణ, క్రీడాకారుల సంక్షేమం, స్కాలర్‌షిప్పులు, ఉద్యోగాలు, బీమా, మహిళా అథ్లెట్లకు ప్రోత్సాహం, స్పోర్ట్స్ మెడిసిన్ ల్యాబ్ ఏర్పాటుపై చర్చిస్తారు.

అలాగే 56 నియోజకవర్గాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్ స్టేడియం, హకీంపేటలోని పారా అథ్లెట్ వసతులను మరింతగా అభివృద్ధి చేసేలా కార్యాచరణపై చర్చిస్తారు. అలాగే తెలంగాణను స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చిస్తారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ టూరిజంను వేగం గా విస్తృతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో చర్చించి నిర్ణ యా లు తీసుకుంటారు. మొత్తంగా..  తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ అమలులో భాగంగా తీసుకునే నిర్ణయాలకు ఈ సమావేశం కీలకంగా మారనుంది.