27-08-2025 01:01:30 AM
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 26(విజయక్రాంతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందించిన చీరల ఉత్పత్తి ఆర్డర్ ను వచ్చే సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ సూచించారు. ఎస్‌హెజీ సభ్యులకు అందజేసే ఏకరూప చీరల ఉత్పత్తిపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన బాధ్యులతో హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్సుటైల్స్ శాఖ ఆధ్వర్యంలో ఆమె కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ముందుగా సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బాధ్యులకు మొత్తం కేటాయించిన ఆర్డర్, వారు ఉత్పత్తి చేసిన అంశాలపై సమీక్షించారు. రాష్ర్టంలోని మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు ఏకరూప చీరలు పంపిణీ చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.ఈ చీరల ఉత్పత్తి ఆర్డర్ లో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ కేటాయించిందని వివరించారు. మొత్తం 4 కోట్ల 30 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ ఇచ్చామని, ఇప్పటిదాకా దాదాపు 50 శాతం పూర్తి అయిందని వెల్లడించారు.
మిగతా ఆర్డర్ ను వచ్చే నెల 15వ తేదీ లోగా ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా పరిశ్రమ బాధ్యులు పవర్ లూమ్స్, కార్మికులు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని, ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. వస్త్ర పరిశ్రమ ఆర్డర్లకు సంబంధించిన బిల్లులు త్వరలోనే అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో చేనేత జౌళి శాఖ జేడీ, టెస్కొ సీజీఎం ఎన్ వీ రావు, ఏడీ రాఘవరావు, అధికారులు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాధ్యులు పాల్గొన్నారు.