04-10-2025 01:35:04 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 3 (విజయక్రాంతి): ‘అలయ్ బలయ్’ వంటి కార్యక్రమాలు దేశ సమైక్యతకు గొప్ప చిహ్నాలు అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజకీయ, సామాజిక విభేదాలను పక్కన పెట్టి, ఐక్యత, ఆలింగనం అనే బలమైన సందేశాన్ని చాటిచెప్పే ’అలయ్ బలయ్’ కార్యక్రమంహైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా మరుసటి రోజు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
హరియాణా మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ సమయంలో నేతల మధ్య ఐక్యత కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని, ఇప్పుడు ఆయన కుమార్తె విజయలక్ష్మివిజయవంతంగా నిర్వహిస్తున్నారు. వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికీ దత్తాత్రేయ కండువాలు వేసి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు దేశంలో జరుగుతున్న విభజన రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘వేషం, భాష వేరైనా మనమంతా ఒక్కటే.. దేశాన్ని జాతి, మతాల ఆధారంగా విభజించే ప్రయత్నాలు సఫలం కాకూడదు..విజయదశమి అందరికీ విజయాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు.
సందేశం.. స్వదేశీ మనసుతో కలిసి నడవాలి
‘అలయ్ బలయ్’ కేవలం సంప్రదాయం కాదని, అది తెలంగాణ ఆత్మ అని బండారు దత్తాత్రేయ ఉద్ఘాటించారు. ‘అలయ్ బలయ్ అంటే జాతి, మత, రాజకీయాలు మరచి ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం. స్వదేశీ మనసుతో ముందుకు సాగాలని.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఐక్యతా సహకారాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. రైతులు కర్మ సాగరి వ్యవసాయాన్ని అవలంబించాలని, యువత రాష్ట్ర చరిత్రలో కీలక పాత్ర పోషించిందని ఆయన కొనియాడారు. ఈ వేదికపై కవిత, విజయలక్ష్మిలను ఘనంగా సన్మానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే జరిగిందని, తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రాంతీయ విభేదాలు మరచి ఐక్యంగా ఉండాలని కోరారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు నాగార్జున, బ్రహ్మానందం పాల్గొని ’అలయ్ బలయ్’ గొప్పదనాన్ని వివరించారు.
ప్రముఖుల హాజరు
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డి, అర్జున్ రామ్ మేఘ్వాల్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీపీఐ నేత నారాయణ, తెజస్ నేత ప్రొఫెసర్ కోదండరామ్ వంటి పలువురు కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులు, వివిధ పార్టీల ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బయట కత్తులు దూసుకునే వారు ఇక్కడ అలయ్ బలయ్ చేసుకుంటారు అని ఈ కార్యక్రమ ప్రత్యేకతను వివరించారు. ఈ సంవత్సరం కార్యక్రమం ‘ఆపరేషన్ సిందూర్’ థీమ్‌తో రూ పొందింది. వివిధ రాష్ట్రాల నృత్యకారులు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రానున్న ఏడాది ఇంకా భారీగా నిర్వహిస్తామని విజయలక్ష్మి ప్రకటించారు.
సోదరభావాన్ని పెంపొందించేలా ‘అలయ్ బలయ్’
* రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అందరిలో సోదర భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహ దపడతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. మాజీ గవర్నర్ దత్తాత్రేయ ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రపతి తన సందేశాన్ని పంపించారు.