05-10-2025 12:00:00 AM
ప్రహరీ లేని పాఠశాలలు
మహబూబాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు రక్షణ కరువైంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడలు చాలా చోట్ల కూలిపోయాయి. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కొన్నిచోట్ల, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరికొన్ని చోట్ల పాఠశాలలకు చెందిన ప్రహరీ గోడలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 102 జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలు ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలో 102 ఉన్నాయి.
అలాగే 646 ప్రాథమిక పాఠశాలలో ఉన్నాయి. ఇందులో చాలా పాఠశాలలు ఆర్ అండ్ బీ రహదారులు, మండల, గ్రామ పరిధిలో ఉన్న ప్రధాన రహదారులకు సమీపంలో ఉన్నాయి. 349 పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవు. ఇందులో మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 343 ఉండగా, ఇతర పాఠశాలను ఆరు ఉన్నాయి. పాఠశాలల ప్రహరీ గోడలు కూలిపోవడం, మరి కొన్నిచోట్ల గోడలు నిర్మించకపోవడం వల్ల పాఠశాలలకు రక్షణ కరువైంది. పాఠశాలల్లోకి ప్రహరీ గోడ లేకపోవడం వల్ల పశువులు, ఇతర క్రిమి కీటకాలు, పాములు తేళ్లు వస్తున్నాయి.
దీనికి తోడు వర్షాల సమయంలో వరద నీరు పాఠశాలలోకి వచ్చి చేరుతుంది. చీకటి పడిందంటే చాలు ప్రహరీ గోడ లేని చోట అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు పండగలు ఇతర సెలవుల సమయంలో పాఠశాలల్లోకి ప్రవేశించి ఆవరణను చెడు వ్యసనాలకు వినియోగిస్తున్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో పలు పాఠశాలలకు ప్రహరీ గోడలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరైనప్పటికీ పనులు చాలా చోట్ల అసంపూర్తిగా వదిలేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
పాఠశాలలకు ప్రహరీ గోడలు లేకపోవడం వల్ల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పూల మొక్కలు ఇతర నీడ నిచ్చే వృక్షాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి ప్రహరీ గోడలకు నిధులు మంజూరు చేసి పాఠశాలలకు రక్షణ కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ప్రహరీ గోడలకు చర్యలు
మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడల కోసం ప్రభుత్వానికి ఇప్పటికే సమగ్ర వివరాలతో, ఫోటోలతో నివేదికల సమర్పించాం. జిల్లా వ్యాప్తంగా 170 పాఠశాలలకు ప్రహరీ గోడలు ఇతర మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. నిధుల విడుదల కూడా జరిగింది. సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలవడం, పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
- కాలేరు యాదగిరి, మండల విద్యాధికారి, కేసముద్రం