04-10-2025 01:08:01 AM
-విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు
-2030 నాటికి ప్రపంచ కర్మాగారంగా భారతదేశం
-దేశ అభివృద్ధిలో జైన వ్యాపారవేత్తలు కీలక పాత్ర
-జీటో కనెక్ట్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
-విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్.. తెలంగాణ : మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : రక్షణ రంగంలో స్వావలంబన దిశ గా భారతదేశం అద్భుత పురోగతి సాధిస్తుందని, ఇకపై విదేశీ సరఫరాదారులపై ఆధార పడాల్సిన అవసరం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ‘జీటో కనెక్‌ెే్ట2025’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశం ‘బొమ్మల తయారీ నుంచి యుద్ధ ట్యాంకుల తయారీ వరకు’ ప్రపంచ కేంద్రం గా ఎలా మారుతుందో వివరించారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ అని ప్రతి భాగం, ఆయుధంపై ప్రదర్శించడం గర్వంగా ఉందన్నారు.
ప్రభుత్వం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఇటీవల 97 తేలికపాటి యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయని, దేశంలో 64 శాతం కంటే ఎక్కువ పరికరాలు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. తేజస్ యుద్ధ విమానాలు, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, అర్జున్ ట్యాంకులు వంటివి తయారు చేసేందుకు అధునాతన భారతీయ సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాన్ని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. 11 సంవత్సరాల క్రితం భారత రక్షణ ఎగుమతులు రూ. 600 కోట్లుగా ఉండేవని, ప్రస్తుతం ఆ మొత్తం రూ. 24,000 కోట్లకు పెరిగిందన్నారు. ఇది 2029 నాటికి రూ. 50,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.
విస్తరిస్తున్న భారతదేశ రక్షణ సామర్థ్యాల లక్ష్యం దూకు డు కాదని, జాతీయ విలువల రక్షణ అని ఆయన నొక్కి చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్ అయినా లేదా మరేదైనా మిషన్ అయినా మన దేశాన్ని రక్షించడానికి మాత్రమే అని తేల్చి చెప్పారు. 2030 నాటికి భారతదేశం ‘ప్రపంచ కర్మాగారం’గా మారే దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, జీఈ ఎం పోర్టల్ ద్వారా మాత్రమే ప్రభుత్వ కొనుగోళ్లలో రూ. 15 లక్షల కోట్లుగా ఉందన్నారు. అత్యాధునిక ట్యాంకులను ఉత్పత్తి చేయడం, 153 దేశాలకు బొమ్మలను ఎగుమతి చేయ డం ద్వారా భారతదేశం తన ‘లోకల్ ఫర్ గ్లోబల్’ దృష్టిని ముందుకు తీసుకువెళుతోందని పేర్కొన్నారు.
2030 నాటికి కొనుగోలు శక్తి పరంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉంటుందని అంచనా వేశారు. దేశ నిర్మాణానికి జైన సమాజం, జీటో చేసిన కృషిని కూడా రక్షణ మంత్రి ప్రశంసించారు. భారతదేశ మొత్తం జనాభాలో జైన జనాభా 0.5 శాతం మాత్ర మే ఉన్నప్పటికీ, పన్ను ఆదాయంలో వారు 24 శాతం వాటా కలిగి ఉన్నారని, వారి ఆర్థిక సహకారాన్ని కొనియాడారు. వస్త్రాల నుంచి విమానయానం వరకు భారతదేశ అభివృద్ధిలో జైన వ్యాపారవేత్తలు కీలక పాత్ర పోషించారని తెలిపారు.
పెట్టుబడులకు ముందుకు రావాలి
‘విలువలతో కూడిన వృద్ధి’కి కేరాఫ్‌గా తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడు లు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జీటో) హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో హైటెక్స్, హెచ్‌ఐసీసీలో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న ‘జీటో కనెక్ట్ 2025’ సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని మాట్లాడారు.
ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలను చూసే పెట్టుబడులు పెట్టేవారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వారి ఆలోచన తీరు కూడా మారిందన్నారు. తెలంగాణ అవకాశాల గని అని, పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత అనుకూల పరిస్థితులున్నాయని వివరించారు. జైన సమా జం ‘సేవా’ స్ఫూర్తిని, తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌తో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతమవుతుందని వెల్లడించారు. నిజమైన యూనికార్న్ అంటే బిలియన్ డాలర్ల విలువ కాదని, లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేయడమని యువ పారిశ్రామిక వేత్తలు, ఆవిష్కర్తలకు సూచించారు.