calender_icon.png 15 August, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మా కంపెనీలు ప్రమాణాలు పాటించాలి

14-08-2025 01:09:19 AM

  1. కంపెనీలపై పీసీబీ అధికారులు నిఘా ఉంచాలి

ప్రజల ఆరోగ్యంపై ఉదాశీనత వద్దు

పీసీబీ అధికారులపై మంత్రి సురేఖ ఆగ్రహం

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం ఫార్మా, డ్రగ్ కంపెనీలు ప్రమాణాలు పాటించాలని పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఫార్మా, బల్క్ డ్రగ్ పరిశ్రమల అనుమతుల విషయంలో అవకతవకలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్జీటీ ముందు ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను మంత్రికి పీసీబీ అధికారులు వివరించారు.

సీపీసీబీ(సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు)కి అందిన ఫిర్యాదుల వివరాలు కూడా తెలుసుకున్నారు. బుధవారం సచివాలయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులతో మంత్రి సురేఖ భేటీ అయ్యారు. ఎంతటి వారైనా పర్యావరణ పరిరక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని,అవసరం అయితే టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

అయితే ప్రతి ఆరు నెలలకి ఒకసారి కంపెనీలలో సాధారన తనిఖీ చేస్తున్నట్టు మంత్రికి పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి వివరించారు. కంప్యూటరైజ్డ్ తనఖీ ప్రక్రియ కూడా చేపడుతున్నట్టు వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన మేరకు ఓఆర్‌ఆర్ అవతలనే ఫార్మా కంపెనీలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

పొల్యూషన్ కంట్రోల్ ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ముఖ్యమైన సమావేశానికి కొన్ని కంపెనీ ప్రతినిధులు రాకపోవడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. కంపెనీలకు అనుమతుల్లో ఉదాశీనత సరికాదని, ఎక్కడైనా ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. చౌటుప్పల్ ఏరియా నుంచి పర్యావరణ పరిరక్షణ, నీటి కలుషితం మీద విపరీతమైన ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.

సిగాచి ఘటన తర్వాత కంపెనీల్లో మరింత భద్రత అవసరమన్న విషయం గుర్తించాలని మంత్రి సురేఖ సూచించారు. పీసీబీ తరఫున కూడా రైడ్స్ జరుగుతాయని హెచ్చరించారు. సమావేశానికి అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ అహ్మద్ నదీం, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి, సీఈ రఘు, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు, వెంకన్న, రవిశంకర్, పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల నుంచి పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.