calender_icon.png 8 August, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అచ్చంపేటలో గువ్వల రాజీనామా అలజడి.!

08-08-2025 02:00:17 AM

  1. నష్ట నివారణ చర్యల్లో గులాబీ పార్టీ
  2. ముఖ్య కార్యకర్తలతో వరుస సమావేశాలు
  3. నేతలు పార్టీ మారినా పార్టీకి నష్టమేంలేదన్న సంకేతాలకు ప్లాన్.
  4. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రికి పార్టీ పగ్గాలు. 
  5. నేడు మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఉమ్మడి జిల్లాల మాజీ ఎమ్మెల్యేల రాక. 

నాగర్ కర్నూల్ ఆగస్టు 7 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని బిఆర్‌ఎస్ పార్టీలో అలజడి నెలకొంది. జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమయింది. ఉద్యమ పార్టీగా పేరొందిన టిఆర్‌ఎస్ గత పదేళ్ల పాటు రాజ్యసంతో తునిసలాడింది. 

కానీ ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ చేసిన అవినీతి అక్రమాలు బయట పడుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆ పార్టీ నేతలు కలవర పడుతున్నారు. తమ రాజకీయ మనుగడ కోసం మాజీలంతా అధికార కాంగ్రెస్, బిజెపి పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు.  మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అదే పార్టీలో కొనసాగితే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన కొందరు ఇతర పార్టీల వైపు తొంగి చూస్తున్న పరిస్థితి.

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాంతంలోని సుమారు 10 మంది బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో పేక మేడ లాగా ఒక్కసారిగా కూలిపోయే ఆస్కారం ఉందని గ్రహించిన అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేసినప్పటికీ ఆ పార్టీ సెకండ్ కేడర్ పూర్తిగా బిఆర్‌ఎస్ వైపే ఉందనే సంకేతాలు ఇవ్వాలని ప్రయత్నం కనిపిస్తోంది.

గువ్వల బాలరాజు అధికారికంగా ఈనెల 4న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా ఈనెల 2న రాజీనామా చేసి ముందే అధినాయకుడికి పంపించినట్లు తెలుస్తోంది. వెంటనే మరుసటి రోజే అచ్చంపేటలోని ముఖ్య కార్యకర్తలతో మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాదులోని ఒక ప్రాంతంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి గువ్వల వెళ్లినా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా కల్పించారు.

రాజీనామా చేసిన అనంతరం మొదటిసారి అచ్చంపేటకు వచ్చిన గువ్వల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించిన బీఆర్‌ఎస్ వెంటనే అదే సమయానికి ఆ పార్టీ ముఖ్య కార్యకర్తలు కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడం విశేషం. దీంతో పాటు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తూ  ఈనెల 8న భారీ బహిరంగ సభను ఏర్పాటుకు సిద్ధం చేశారు.

పదేళ్లపాటు గువ్వల బాలరాజు ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహించని బిఆర్‌ఎస్ పార్టీ నష్ట నివారణ కోసం ఒక్కసారిగా గువ్వల స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆ స్థాయి నేతల కోసం పాకులాడుతూ కనిపించడం కొసమెరుపు. 

మాజీ ఎమ్మెల్యే మర్రికి పార్టీ పగ్గాలు.

నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓకింత అలకబూనినట్లు ప్రచారం జరుగుతుంది. తాను ఆశించిన విధంగానే గువ్వల రాజీనామా చేసిన వెంటనే అచ్చంపేటలో జరపబోయే బహిరంగ సభకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.

గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఇకపై అందరం కలిసికట్టుగా పని చేద్దామని చెప్తూ వచ్చారు. అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను కూడా బిజెపి పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడి బిఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తికే ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.

ఉమ్మడి జిల్లాలోని మరి కొంతమంది టిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆయా పార్టీలోకి వలస వెళ్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో వారిని కూడా బుజ్జగించడంతో పాటు అచ్చంపేటలో జరిగే ఈ సభ వారిని మేలుకొల్పే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. నేతలు ఎంతమంది పార్టీలు మారినా కార్యకర్తలు, ప్రజలు మాత్రం కేసీఆర్ వైపే ఉన్నారన్న సంకేతాన్ని బలంగా వినిపించేందుకు అచ్చంపేటలో బిఆర్‌ఎస్ అధిష్టానం పావులుతోందని తెలుస్తోంది.