calender_icon.png 8 August, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల ఓట్లు.. ఓసీల సీట్లు

08-08-2025 12:59:42 AM

  1.    8% జనాభాకే అసెంబ్లీలో ఎక్కువ ప్రాతినిథ్యం
  2. ప్రస్తుత శాసనసభలో 62 మంది వారే 
  3.    50 శాతానికిపైగా ఉన్న బీసీల నుంచి అసెంబ్లీకి 19 మందే
  4. రిజర్వేషన్ లేక తీవ్రంగా నష్టపోతున్న బీసీలు
  5. ఇప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టని కులాలే ఎక్కువ
  6.    42% రిజర్వేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న బీసీలు

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఏ సామాజిక వర్గమైనా విద్య, ఉద్యోగ, ఆర్థికంగా తమ హక్కులను పొందాలంటే ముందుగా వారు రాజకీయంగా తమ జనాభాకు తగిన స్థాయిలో ప్రాతినిధ్యం పొందాలి. హక్కుల సాధనలో, చట్ట రూపకల్పనలో రాజకీయ ప్రాతినిధ్యం ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో రాజకీయంగా సరై న ప్రాతినిధ్యం లభించని పక్షంలో వారు అన్నిరకాలుగా నష్టపోతారు.

దీనికి ప్రస్తు తం బీసీల పరిస్థితి సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ అసెంబ్లీలో బీసీల ప్రాతినిథ్యాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి సమాజంలోని అన్ని సామాజికవర్గాల్లోకెల్లా బీసీలే చాలా రకాలుగా వెనుకబడి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సామాజిక వర్గాల్లో  కొం దరు వారి జనాభా శాతం కంటే అధికం గా, మరికొందరు జనాభా ఉన్న స్థాయిలోనైనా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీ యంగా లబ్ధి పొందుతున్నారు.

కానీ బీసీల పరిస్థితి మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా మారింది. అటు విద్య, ఉద్యోగ, ఆర్థికంగానూ లబ్ధి చేకూరకపోవడంతోపాటు ఇటు రాజకీయంగానూ సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు. రాష్ట్రంలో సగాని కంటే ఎక్కువ బీసీల జనాభానే ఉంది. అయినా బీసీలు కేవలం ఓట్లు వేసేందుకు మాత్రమే పరిమితమవుతున్నారు. వారి ఓట్లతో ఇతరులు ప్రజాప్రతినిధులుగా గెలిచి చట్టసభలకు ఎన్నికవుతున్నారు.

ఈ నేప థ్యంలోనే తమకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలంటే రాజకీయ ప్రాతినిథ్యం పెరగాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం బీసీలు గుర్తించారు. అందుకే తమకు ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ప్రాతినిథ్యంలో వారి ఆధిపత్యమే..

దేశవ్యాప్తంగా బీసీల వెనుకబాటుతనం ఉన్నప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో ఆయా సామాజిక వర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్యను గమనిస్తే బీసీలు ఏ స్థాయిలో రాజకీయంగా నష్టపోతున్నారో అర్థమవుతుంది. అసెంబ్లీలో మొత్తం 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఓసీ సామాజిక వర్గం నుంచి 62 మంది ఎమ్మెల్యేలు, బీసీల నుంచి 19 మంది ఎమ్మెల్యేలు, ఎస్సీల నుంచి 19 మంది ఎమ్మెల్యేలు, ఎస్టీల నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ముస్లింల నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయితే రాష్ట్రంలో ఓసీల జనాభా కేవలం 8 శాతం మాత్రమే. కానీ వారి సామాజికవర్గం నుంచి అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహిస్తున్నది మాత్రం 52 శాతం కావడం గమనార్హం. బీసీల జనాభా 56 శాతం ఉన్నప్పటికీ వారి ప్రాతినిథ్యం మాత్రం 16 శాతంగా ఉన్నది. ఎస్సీలు 16 శాతం, ఎస్టీలు 10 శాతం, ముస్లింలు 6 శాతం ప్రాతినిథ్యం పొందుతున్నారు.

ఎస్సీలు, ఎస్టీలు జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్ పొందుతున్నారు. కానీ అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రాతినిథ్య శాతాలను గమనిస్తే అన్ని సామాజికవర్గాల కంటే బీసీలే రాజకీయంగా అత్యంత వెనుకబడి ఉన్నట్టు స్పష్టమవుతోన్నది. సగానికి పైగా జనాభా ఉన్నప్పటికీ రిజర్వేషన్ లేని కారణంగా బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. 

బీసీల్లోనూ కొందరే...

వాస్తవానికి రిజర్వేషన్‌ల కోసం పోరాడుతున్న బీసీల్లోనూ వెనుకబడిన ఉప కులాలున్నాయి. బీసీల్లోని చాలా ఉప కులాలకు ఇప్పటికీ అసెంబ్లీలో ప్రాతినిథ్యం లభించకపోవడం వారి అత్యంత వెనుకబాటుతనానికి నిదర్శనం. తాము కేవలం ఓటు వేసేందుకు మాత్రమే పరిమితం కావడం ఎంతో దారుణమని ఆ కులాలకు చెందినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి బీసీలను 5 కేటగిరీలుగా వర్గీకరించారు.

అందులో బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-సీ, బీసీ-డీ, బీసీ-ఈ వర్గాలున్నాయి. బీసీ-ఏ కేటగిరిలో 18 ఉప కులాలు, బీసీ-బీలో 33 ఉప కులాలు, బీసీ-సీలో 1, బీసీ-డీలో 52 ఉప కులాలు, బీసీ-ఈలో 35 ఉప కులాలున్నాయి. మొత్తంగా బీసీల్లో 139 ఉప కులాలు ఉన్నాయి. అయితే వీరిలో మున్నూరు కాపు, గౌడ, యాదవ, ముదిరాజ్, పద్మశాలి కులాల మినహా మిగిలిన ఉప కులాలేవీ పెద్దగా రాజకీయ ప్రాతినిథ్యాన్ని పొందలేదు.

మొత్తం 139 కులాల్లో దాదాపు 120 కులాలకుపైనే కనీసం ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా గెలిచి అసెంబ్లీలో అడుగు కూడా పెట్టకపోవడం గమనార్హం. బీసీల్లోనూ కేవలం 5 నుంచి 10 కులాలు మాత్రమే బీసీ సామాజిక వర్గం పేరిట లబ్ధి పొందుతున్నట్టు అసంతృప్తి వ్యక్తమవుతున్నది. కనీసం రిజర్వేషన్ల అమలుతోనైనా తమకు కూడా రాజకీయంగా సరైన గుర్తింపు లభిస్తుందని వారు ఆశిస్తున్నారు. 

రిజర్వేషన్ లేనిపక్షంలో మరో ఉద్యమమే..

విద్య, ఉపాధి, ఆర్థికపరంగా వెనుకబాటు అధిగమించి రాజకీయంగానూ సరైన ప్రాతినిథ్యం పొందాలంటే బీసీలకు 42 శాతం అమలు కావాలి. రిజర్వేషన్ల అమలుతోనే బీసీలకు అన్నిరకాలుగా న్యాయం జరుగుతుంది. దశాబ్దాలుగా రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్న బీసీలు త్వరలోనే తమ కలలు సాకారం అవుతుందని ఆశిస్తున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా పార్టీల వైఖరి చూస్తుంటే ఆశించినంత త్వరగా బీసీ రిజర్వేషన్ అంశం తేలేలా లేదని అర్థమవుతున్నది. 

రాష్ట్ర ప్రభుత్వం బిల్లు, ఆర్డినెన్స్‌లను ఆమోదానికి పంపడం, రాష్ట్రపతి, గవర్నర్ వాటిని పెండింగ్‌లో పెట్టడం గమనిస్తుంటే ఇప్పట్లో రిజర్వేషన్ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. అయితే బీసీలు మాత్రం 42 శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలవుతుందని ఎంతో ఆశగా ఎదురుచూ స్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ సాధ్యంకాని పక్షంలో ఉద్యమబాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈసారి దేశవ్యాప్త ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీని కోసం రాష్ట్రాలకు, పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నారు. బీసీ రిజర్వేషన్ సాధన ఉద్యమానికి కావాల్సిన కార్యాచరణ రూపకల్పన దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. 

ఓసీల్లోనూ రెడ్డి, వెలమలే

మొత్తం జనాభాలో 8 శాతం ఓసీ లు ఉండగా వారిలో 4 శాతం రెడ్డీలు, 0.28 వెలమ, 0.68 కమ్మ, 3 శాతం ఇతర ఓసీలు కులాల వారు ఉన్నారు. అయితే ఓసీల్లోనూ రాజకీయంగా రెడ్డి, వెలమ కులాల వారిదే ఆధిపత్యం కనబడుతోంది. నాలుగు శాతం జనా భా ఉన్న రెడ్డి సామాజికవర్గం నుంచి 43 మంది ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో ఆయా పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

కేవలం 0.28 శాతం జనాభా ఉన్న వెలమలు 13 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 0.68 శాతం జనాభా ఉన్న కమ్మలు 4, ఇతర ఓసీ కులాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నారు. ఈ గణాంకాలు పరిశీలిస్తే ఓసీల్లోనూ రెడ్డి, వెలమలు రాజకీయంగా ఏ స్థాయిలో లబ్ధి పొందుతున్నారో స్పష్టమవుతున్నది. 56 శాతం జనాభా ఉన్న బీసీలు రాజ్యాధికారం మాట పక్కన బెడితే కనీసం తగిన ప్రాతినిథ్యం కూడా పొందలేకపోతున్నారు. 

కానీ కేవలం 5 శాతం జనాభా ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ సామాజిక వర్గాలు 65 శాతానికి పైగా సీట్లతో రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు.