calender_icon.png 8 August, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెలరేగిన మొరం మాఫియా..!

08-08-2025 12:30:21 AM

  1. రాత్రి పడితే చాలు తెల్లవారుజామున వరకు గుట్టలు మాయం

అక్రమ మొరం మాఫియాకు రెవెన్యూ, పోలీస్ అధికారుల వత్తాసు

ఫిర్యాదులు చేసిన కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు

ఎన్నిసార్లు దాడులు జరిగినా మారని మాఫియా తీరు

అక్రమ మొరం రవాణాకు అడ్డుకట్టు పడేది ఎప్పుడో..?

బాన్సువాడ, ఆగస్టు 7 ః రాత్రి పడితే చాలు మొరం మాఫియా రాత్రికి రాత్రి గుట్టలను గుటుక్కుమని మాయం చేస్తున్నారు. గ్రామ శివారులు, పట్టణ శివారు లతోపాటు చెరువులు, గుట్టలను తవ్వేస్తూ మొరం మాఫియా మొరం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. సెలవు దినాలతో పాటు రాత్రి వేళల్లోనూ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టరాజ్యంగా మొరం తరలిస్తూ లక్షలాది రూపాయలను అర్జిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ డివిజన్ పరిధిలోని జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పిట్లం, పెద్ద కోడాప్గల్, నిజాంసాగర్, బీర్కూర్, నస్రుల్లాబాద్, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బీర్కూర్ , కోటగిరి, వర్ని, చందూర్, పోతంగల్, రుద్రూర్ ,మోస్రా మండలాల్లో  మొరం, మట్టి అక్రమ తరలింపు జోరుగా సాగుతుంది . బాన్సువాడ మండలం సోమేశ్వర్  వాసుదేవి పల్లి శివారు జనిగేలా కుంట లో , బీర్కూరు మండలం రైతు నగర్ అన్నారం చించోలి దామరంచ గ్రామ శివారులో ఎలాంటి అనుమతి లేకుండా యథేచ్ఛగా అక్రమ మొరం తవ్వకాలు  సాగుతోంది.

ఇంత జరుగుతున్న రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులు రాత్రిపూట తవ్వకాలు జరిపి గుట్టలను, చెరువులను మాయం చేస్తున్నారు.  మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా అధికార పార్టీకి చెందిన నాయకుల పేరు చెప్పి తవ్వకాలు చేపడుతున్నారు. మొరం మాఫియా ఆగడాలు మితిమీరడంతో వనరులు, వృక్ష సంపద కనుమరుగవుతున్నది.

ప్రభుత్వ ఆదాయానికి గండి

అనుమతులు  లేకుండా సాగుతున్న  మొరం వ్యాపారంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నది. మొరం  వ్యాపారం చేయాలంటే మైనింగ్ శాఖ నుంచి అనుమతులు తీసుకొని రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇవ్వాలనే నిబంధన ఉన్నది. కానీ బాన్సువాడ డివిజన్లో నిబంధనలను తుంగలో తొక్కి దర్జాగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

రాష్ర్ట ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అక్రమ మొరం, మట్టి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖ అధికారులు మామూలు తీసుకొని అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అభివృద్ధి పనుల పేరిట అధికారులకు తెలుపుతూ ప్రైవేటు వ్యక్తులు చేపడుతున్న ఇండ్ల నిర్మాణాలు, వెంచర్లు ఇతరత్రా నిర్మాణాలకు రాత్రి సమయాల్లో మట్టి, మొరం విక్రయాలతో వ్యాపారం సాగిస్తున్నారు. మట్టి, మొరం అక్రమ తవ్వకాలను నియంత్రించాలని స్థానికులు పేర్కొంటున్నారు.

మొరం మాఫియాతో అధికారుల కుమ్మక్కు..

రాత్రి వేళలో జరుగుతున్న అక్రమ మోరం తవ్వకాలు రవాణాకు రెవిన్యూ, పోలీస్ శాఖలో కొంతమంది అధికారులు కుమ్మక్కు అయినట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు పోలీస్ శాఖ అధికారుల ఎదుట నుండే అక్రమ మొరం రవాణా సాగుతున్న పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు సైతం పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.

ఇంత అక్రమ రవాణా జరుగుతున్న అటు రెవెన్యూ శాఖ అధికారులు ఇటు పోలీస్ శాఖ అధికారులు నియంత్రించడంలో పూర్తిగా విఫల మయ్యారని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కొంతమంది అధికారుల ప్రమేయం ఉండడంతోనే రాత్రి వేళలో అక్రమ రవాణా సాగుతుందని పలు విమర్శలకు  తావు ఇస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక బృందంతో తనిఖీలు చేపట్టి అక్రమ మొరం రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.