calender_icon.png 8 August, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ యూటర్న్

08-08-2025 12:54:51 AM

  1. రాహుల్ ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు పెంపు అంటున్నారు
  2. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఈ షరతు ఉందా?
  3. వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టి బీసీ సబ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టాలి
  4. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసగిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, వాటికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న హస్తం పార్టీ, ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాకే ఇస్తామని రేవంత్‌రెడ్డి మాట మార్చారని ఆరోపించారు. బీసీ డిక్లరేషన్‌లో ఈ షరతు ఉందా అని ప్రశ్నించారు.

గతంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి తెలంగాణ ఏర్పాటుతోనే తిరిగి వస్తానని ప్రకటించి రాష్ట్రాన్ని సాధించారని, మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి బీసీల రిజర్వేషన్లు సాధించాడా? లేదా? అనేది చెప్పాలని కేటీఆర్ సవాలు విసిరారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పరిగి నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎగిరెగిరి పడుతూ కాంగ్రెస్ పార్టీకి వంత పాడుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. ఈ ప్రభుత్వం రెండున్నరేండ్లే ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని.. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క అధికారి లెక్క తేలుస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ పేరు తీయకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఉండలేకపోతున్నారని, ఆయనకు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు.

బీసీ రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్, బీసీ డిక్లరేషన్‌లోని ఇతర హామీలను పూర్తిగా పక్కనబెట్టిందని ఆరోపించారు. ‘ప్రధాని మోదీతో, రాహుల్ గాంధీతోనూ రేవంత్‌రెడ్డి చేస్తున్నది డ్రామా, చంద్రబాబు కోసం తెలంగాణ ప్రయోజనాలను పక్కనబెడుతూ ఆయన చేస్తున్నది డ్రామా, చివరికి కాంగ్రెస్ పార్టీలో చివరిదాకా ఉంటానని రేవంత్ చెబుతున్న మాటలు కూడా డ్రామానే’ అని కేటీఆర్ మండిపడ్డారు.

సీఎం రేవంత్ జడ్పీటీసీ కాకముందే మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి పట్ల నియోజకవర్గంలో ఓడిపోయిన అభ్యర్థిని వేదికపై కూర్చోబెట్టి ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యామని, కాంగ్రెస్ పార్టీ చెప్పిన కాకమ్మ కథలను ప్రజలు నమ్మి దుర్మార్గులకు ఓటు వేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

తమ హయాంలో తెలంగాణ అభివృద్ధిపై మాత్రమే దృష్టి సారించడం వల్ల పార్టీ కార్యకర్తలకు కాస్త విస్మరించిన మాట నిజమేనని కేటీఆర్ అంగీకరించారు. మళ్లీ అధికారంలోకి రాగానే కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి నేత, కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కష్టపడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ కండువా ఉంటుందని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలను మట్టికరిపించి మళ్లీ కేసీఆర్‌ని సీఎంగా ఎన్నికుందామని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టి బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కండువాలు కప్పుకొని ఇప్పుడు దేవుడి కండువాలు కప్పుకున్నామని అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో రాష్ర్టంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని కేటీఆర్ చెప్పారు.

స్థానిక ఎన్నికల్లో ఖర్చుకు కాంగ్రెస్ అడ్డగోలు నిధులు

స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, కాంగ్రెస్ నాయకులు గత 20 నెలలుగా సంపాదించిన అడ్డగోలు అవినీతి పైసలను ప్రజలకు భారీగా పంచబోతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలు తగ్గాలంటే, అధికారులు ప్రజల మాట వినాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టంలో అన్ని వర్గాలను మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు.

తెలంగాణలో కరెంటు కోతలు, ఎరువుల కొరత, గ్రామాలు సంక్షోభంలోకి పోవడం, పట్టణాల్లో పాలన పడకేయడం వంటి అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనతో తెలంగాణ మళ్లీ పదేండ్లు వెనక్కి వెళ్లిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ రైతుభరోసా పథకాన్ని నిలిపేస్తోందని జోష్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోని వ్యక్తిగాని, వర్గం గాని ఒక్కటి కూడా లేదని కేటీఆర్ విమర్శించారు.

నిరుద్యోగ హామీలపై పోస్టర్

కాంగ్రెస్ హయాంలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగ యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం నేటి వరకు తన హామీలను అమలు చేయలేదన్నారు. యువతను మోసం చేయడానికి కాంగ్రెస్ విడుదల చేసిన యూత్ డిక్లరేషన్, 420 హామీలు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలు నెరవేరలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్వీ రూపొందించిన ప్రత్యేక గూగుల్ స్కానర్ పోస్టర్‌ను గురువారం కేటీఆర్ హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న నివాసంలో ఆవిష్కరించారు.

ఈ పోస్టర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూఆర్  కోడ్ ద్వారా కాంగ్రెస్ మ్యానిఫెస్టో, యూత్ డిక్లరేషన్, 420 హామీలు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చేసిన హామీల వీడియోలు అన్ని ఒకే చోట పొందుపరిచామని, ఈ కోడ్ ద్వారా ప్రజలకు నిజాలు తెలుసుకొనే వీలుంటుందని బీఆర్‌ఎస్వీ నేతలు చెప్పారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి, యువతను మోసం చేసిన తీరును గమనించి, తక్షణమే తమ హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోస్టర్‌ను బీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్ నాయక్ రూపొందించినట్టు బీఆర్‌ఎస్వీ నేతలు చెప్పారు.