calender_icon.png 8 August, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కదిలిన యంత్రాంగం

08-08-2025 12:14:02 AM

- సీఎం ఆదేశాలతో క్షేత్రస్థాయికి అధికారులు 

- విద్యా, వైద్యంపై ఫోకస్ హాస్టళ్లు, గురుకులాల్లో తనిఖీలు

మేడ్చల్, ఆగస్టు 7 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నెల రోజుల క్రితం వరకు హాస్టళ్లు, గురుకులాలు, ఆసుపత్రుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. హాస్టళ్ళు, గురుకులాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, నాణ్యమైన ఆహారం అందకపోవడంతో విద్యార్థులు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. వార్డెన్లు, ప్రిన్సిపాళ్ళు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పుడు ఏ అధికారి వచ్చి తనిఖీ చేస్తారో అనే భయం ఏర్పడింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల 21న జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. సీఎంఓలోని అధికారులకు జిల్లా బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్ జిల్లాకు సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. అంతేగాక కలెక్టర్లు ఏమి చేస్తున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివేదిక తెప్పించుకుంటున్నారు. దీంతో కిందిస్థాయి నుంచి కలెక్టర్ వరకు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. 

సీఎం ఆదేశాలతో సత్ఫలితాలు 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సత్ఫలితాలు వస్తున్నాయి. అధికారుల్లో జవాబుదారీతనం కనిపిస్తోంది. అన్ని డిపార్ట్మెంట్లలో సిబ్బంది విధిగా విధులకు హాజరవుతున్నారు. తనిఖీలపై అన్ని డిపార్టుమెంటులలో విస్తృత చర్చ జరుగుతోంది. అంతేగాక తనిఖీలలో లోపాలు కూడా బయటపడుతున్నాయి. ముఖ్యంగా హాస్టళ్ళు, గురుకులాల్లో వసతులు లేకపోవడం, ఆహారం సరిగా ఉండకపోవడం వంటివి అధికారులు తనిఖీలలో గుర్తిస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించడానికి చర్యలు తీసుకోవాలని వార్డెన్లు, ప్రిన్సిపాల్ లకు అధికారులు సూచిస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకుంటే వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నారు.

కలెక్టర్, అదనపు కలెక్టర్లు, హె ఓ డి లు తనిఖీలు చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ మను చౌదరి మూడు చింతలపల్లి మండలం జగ్గంగూడలోని మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీ, స్కూలును తనిఖీ చేయగా, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మేడ్చల్ లోని ఎస్సీ బాలికల హాస్టల్ ను తనిఖీ చేశారు. బాలికల హాస్టల్ లో సౌకర్యాలు సరిగా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా జిల్లా, మండల పరిషత్ భవనాలు పరిశీలించి అందులోకి హాస్టల్ ను తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రెవెన్యూ విభాగం అదనప కలెక్టర్ విజయేందర్ రెడ్డి షామీర్పేట్ తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. మంగళవారం కుషాయిగూడ లోని మైనారిటీ జూనియర్ కాలేజీ వసతి గృహాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.

అదే రోజు అదనపు కలెక్టర్ రాధిక గుప్త షామీర్పేట మండలం సింగరాయపల్లి, తూముకుంట లో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. సోమవారం ఘట్కేసర్ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఓపి, డెలివరీ రిజిస్టర్లను, మందులను పరిశీలించారు. ఒకటో తేదీన షామీర్పేటలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులాన్ని సందర్శించారు. రోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ తనిఖీలు మాత్రం చేస్తూనే ఉన్నారు.

సోమవారం ప్రజావాణిలో పాల్గొనడమే గాక సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఆ తర్వాత ఘట్కేసర్ వెళ్లి ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. మంగళవారం మేడ్చల్ లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆ తర్వాత కుషాయిగూడ వెళ్లి మైనారిటీ వసతి గృహం తనిఖీ చేశారు. వారం రోజుల క్రితం కలెక్టర్ ప్రైవేటు ఎరువుల దుకాణం కూడా తనిఖీ చేశారు. జిల్లా అధికారులు కాకుండా సెర్ప్ సీఈవో, జిల్లా స్పెషల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ ఇటీవల మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రి తనిఖీ చేశారు.

రోడ్డెక్కిన విద్యార్థులు 

షామీర్పేట మండలం తురకపల్లిలోని జ్యోతిబాపూలే బిసి రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ విద్యార్థులు తమకు కనీస సౌకర్యాలు లేవని, ఆహారం సరిగా ఉండడం లేదని, ప్రిన్సిపల్ పట్టించుకోవడంలేదని రాజీవ్ రహదారిపై ఆందోళన చేశారు. జూలై 15న కలెక్టర్ మను చౌదరి గురుకులాన్ని తనిఖీ చేసి కనీస సౌకర్యాలు లేవని గుర్తించారు.

బాత్రూములకు డోర్లు కూడా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులకు సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ నివేదిక మేరకు జూలై 16న ప్రిన్సిపల్ షీలా ను సస్పెండ్ చేస్తూ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గురుకులాలు హాస్టల్లో ఉన్న దుస్థితికి ఇది అద్దం పడుతోంది. అధికారులు ముమ్మర తనిఖీలు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.