11-02-2025 12:00:00 AM
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం, ఫిబ్రవరి -10 (విజయక్రాంతి) : దివ్యాంగుల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు తమ సమస్యలు తెలుపుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి వినతి పత్రాన్ని అందించి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నందు ఆటో స్టాండ్ ఒకే సంఘానికి కాకుండా వివిధ సంఘాలకు లేదా టెండర్ రూపంలో ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో బిజీ సెంటర్లలో స్ట్రీ టీ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని, పేద, దివ్యాంగ మహిళలకు కూడా టీ స్టాల్స్ కేటాయిస్తామని, వివరాలు అందించాలని సూచించారు. దివ్యాంగుల కుటుంబ పరిస్థితులను, స్థితిగతు లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నూతనంగా అందించే ఇందిరమ్మ ఇండ్లలో కూడా దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ప్రభుత్వం ద్వారా విడతల వారీగా ప్రతి అరుడికి సంక్షేమ పథకాలు అందుతాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. స్వయం ఉపాధి క్రింద యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి గల దివ్యాంగుల పేర్లు, దరఖాస్తులు అందించాలని, మహిళలు ఎవరైనా ఉంటే మహిళా శక్తి క్రింద అందిస్తామని, పురుషుల కు ఇతర పథకాల క్రింద, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు, ఉపాధి కల్పనకుగల అవకాశాలపై దివ్యాంగులకు అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమం చేపడతామని తెలిపారు.