11-02-2025 12:00:00 AM
ఆహ్వానించిన జాతర నిర్వహణ కమిటీ
మణుగూరు, ఫిబ్రవరి 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మణుగూరు మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో నిర్వహించే శ్రీ భవాని లింగమంతుల జాతరకు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను జాతర నిర్వహణ కమిటీ సభ్యులు సోమవారం ఆహ్వానించా రు.
జాతర ఈనెల 16,17,18వ తేదీల్లో నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యేకు తెలిపారు. జాతర కార్యక్రమాలను పూజ వివరాలను భక్తులకు తెలిపేందుకు ముద్రించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, నెలకొన్న సమస్యలను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర పినపాక నియోజకవర్గంతోపాటు ఇతర ప్రాంతాల నుండి సుమారుగా 20 నుండి 25 వేల మంది భక్తులు వస్తారని, ఇక్కడ మంచి భక్తుల రాకపోకలకి తగినటువంటి రహదారి సౌకర్యం లేకపోవడం, అదే విధంగా అటవీ ప్రాంతం కావడంతో అక్కడ మంచినీటి సౌకర్యం, కరెంటు సదుపాయాలు లేకపోవడం వల్ల భక్తులు అనేక ఇబ్బందులు పడుతారన్నారు.
గుడి ప్రదేశాల్లో వేసిన బోర్లు పనిచేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవా ల్సి వస్తున్నదని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పాయం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. సింగరేణి కాలరీస్, మండల పరిషత్ అధికారులతో మాట్లాడి జాతర ప్రదేశంలో తగినన్ని సదుపాయాలు చేకూర్చాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో శ్రీ భవానీ లింగమంతుల జాతర కార్యనిర్వాహన కమిటీ అధ్యక్షులు పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి మంగి మల్లికార్జున్, కమ్మాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.