calender_icon.png 1 October, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశం కోసమే ఆడా!

01-10-2025 12:53:42 AM

పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టినా సహనం కోల్పోలేదు 

  1. ఈ గెలుపు సైనికులకు అంకితం 
  2. భారత క్రికెటర్ తిలక్‌వర్మ

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 30: ‘ఆసియాకప్ ఫైనల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు నన్ను రెచ్చగొట్టే ప్రయ త్నం చేశారు. నా పట్ల దురుసుగా ప్రవర్తించి ఏకాగ్రత దెబ్బతీయాలని చూశారు. కానీ నా కళ్ల ముందు దేశం మాత్రమే కనిపించింది. మ్యాచ్ ఫినిష్ చేస్తానన్న నమ్మకమే నన్ను నిలబెట్టింది. గెలిచాక కలిగిన ఆనందం వర్ణనాతీతం. ఈ విజయాన్ని భారత జవాన్లకు అంకితం చేస్తున్నాను’ అని హైదరాబాద్‌కు చెందిన టీమిండియా యువ క్రికెటర్ తిలక్‌వర్మ తెలిపారు.

ఆసియాకప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత ఇన్నింగ్స్ (69 నాటౌట్) ఆడిన తిలక్ వర్మపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మకు విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం శేరిలింగంపల్లి లేగల గ్రౌండ్‌కి వెళ్లి అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో ముచ్చటించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాక్ ఆటగాళ్లు ఎన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చినా, దృష్టి మరల్చినా తాను పట్టించుకోలేదని చెప్పారు. జట్టును గెలిపించాలన్న లక్ష్యంతో.. చివరి వరకు అదే విశ్వాసంతో ఆడానని చెప్పారు. ఈ విజయానికి జట్టు సమష్టి కృషే కారణం అని తిలక్ వివరించారు.

తన విజయానికి తల్లిదండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహం కూడా ప్రధాన కారణమని చెప్పారు. చిన్నప్పటి నుంచి వారు చేసిన త్యాగమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని వివరించారు. జనవరిలో జరగబోయే వరల్డ్‌కప్ టోర్నీనే తన తదుపరి టార్గెట్‌గా పెట్టుకున్నానని తిలక్‌వర్మ తెలిపారు.