calender_icon.png 30 August, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడంగ్‌పేట్.. భూములు హాంఫట్!

30-08-2025 12:37:26 AM

-కార్పొరేషన్ లో ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను!

-సుమారు 70వేల గజాల పార్క్ స్థలాలు అన్యాకాంతం 

-బహిరంగ మార్కెట్ విలువ రూ.300కోట్ల పైమాటే 

-అధికారులే అక్రమార్కులకు అండ దండలు 

రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పార్కు స్థలాలన్నీ కబ్జాకు గురవుతున్నాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే తాటికాయ అంత అక్షరాలతో గతంలో బోర్డులు పాతిన చోటనే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఆ స్థలాల్లో నిర్మాణాలకు యథేచ్ఛగా అధికారులు అనుమతులు జారీచేయడం కోసమెరుపు. ఇలా రూ.300 కోట్ల విలువైన భూములు కబ్జాకు గురైనట్లు అంచనా. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ జెండా కింద పనిచేస్తున్న తాజా, మాజీ నేతలే అసలు పాత్రధారులు, సూత్రధారులని స్థానికులు చెబుతున్నారు. బడంగ్ పేటలో కబ్జా బాగోతాలపై నేటి నుంచి వరుస కథనాలు..

రంగారెడ్డి ఆగస్టు 29, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని బడంగ పేట్ కార్పొరేషన్ ప్రస్తుతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. ఆదాయంలో రాష్ట్రంలోనే రెండో కార్పొరేషన్ గా ప్రస్తుతం పేరుగాంచింది. కార్పొరేషన్ కు ఇరువైపులా  ఆదిభట్ల, తుర్కయంజాల్, జల్ పల్లి, తుక్కు గూడ మున్సిపాలిటీ లు, మీర్ పేట్ కార్పొరేషన్ తో పాటు హస్తినాపురం, బీఎన్ రెడ్డి, వనస్థలిపురం, రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ డివిజన్లు ఉన్నాయి.

గతంలో సరూర్ నగర్  మండలంలో తొమ్మిది పంచాయతీలు నాదర్ గుల్, కుర్మలాగూడ, అల్మాస్‌గూడ, గుర్రంగూడ, మామిడిపల్లి, బాలాపూర్, మల్లాపూర్, వెంకటాపూర్, సుల్తాన్ పూర్, బాలాపూర్ అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలాపూర్ మండలం పరిధిలో కార్పొరేషన్ ఉంది. సమీపంలోనే అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఫ్యూచర్ సిటీ,జిల్లా కలెక్టర్ కార్యాలయం, టాటా ఎయిర్ స్పేస్, టీసీఎస్ లాంటి  అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కంపెనీలు, పలు విద్యాసంస్థలు, వృత్తి విద్యాకేంద్రాలు, ప్రముఖ కార్పొరేట్ దవాఖానాలు, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు  ఉన్నాయి.

దీంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. 2013లో అన్ని పంచాయతీలను కలిపి ప్రభుత్వం బడంగ్పేట్ నగర పంచాయతీని ఏర్పాటు చేసింది. అప్పటినుంచి ప్రాంత అభివృద్ధికి బీజం పడిందనే చెప్పవచ్చు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అనంతరం నగరపంచాయతీ మొదలుకొని మున్సిపాలిటీ,కార్పొరేషన్ గా రూపాంతరం చెందింది. బడంగ్పేట్ కార్పొరేషన్ లో 32 డివిజన్లు ఉండగా 300కు పైగా కాలనీల లో దాదాపుగా 2 లక్షల పైగా జనాభా ఉంది. దీంతో ఈ ప్రాంతమంతా నలువైపులుగా శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోవడం తో ఇక్కడ  రియల్ వ్యాపారం మూడు పువ్వులు,ఆరు కాయలుగా విరజిల్లుతుంది.

దీంతో కార్పొరేషన్ లో గజం స్థలం ప్రాంతం బట్టి రూ.50వేల నుంచి రూ.లక్షకు పైగానే ధర పలుకుతుండటంతో అక్రమార్కుల కన్ను కార్పొరేషన్ లోని ప్రభుత్వ స్థలాల పై పడింది. తాజా మాజీలు, అధికార పలుకుబడి ఉన్న వాళ్లంతా తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి యథేచ్ఛగా పార్కు స్థలాలను చెరబట్టి రియల్ వ్యాపారాలకు తెరలేపుతున్నారు. పదేళ్ల నుంచి కార్పొరేషన్ 70వేల గజాలకు పైగా పార్క్ స్థలాలు అన్యాకాంతమయ్యాయి అంటే అతిశ యోక్తి కాదు.  వాటి విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.300కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఇందులో విచిత్రం ఏమిటంటే కంచె చేను మేస్తే అనే చందంగా అధికారులు అక్రమార్కులకు ఉతమిస్తూ వారి అక్రమాలకు వంత పాడటం విశేషం. బడంగ్‌పేట్ కార్పొరేషన్ లో రూ.వందల కోట్ల విలువ చేసే పార్కు స్థలాల కబ్జాలపై  వరుస కథనాలు నేటి నుంచి.

రెచ్చిపోతున్న కబ్జాదారులు...

ప్రభుత్వ అనుమతితో వెంచర్లు విల్లాలు, గ్రేటర్ కమ్యూనిటీ హాల్లో నిర్మిస్తే నిర్మాణదారులు నిబంధన ప్రకారం ప్రజాప్రయోజనాల కింద 10శాతం భూమిని పంచాయతీ, మున్సిపాలిటీ,కార్పొరేషన్ పేరిటా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అట్టి స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని భవిష్యత్తులో ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పార్కులు, కమ్యూనిటీ కేంద్రాలు,వాటర్ ట్యాంకులను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. అయితే బడంగ్ పేట కార్పొరేషన్ లో ప్రజా అవసరాలకు వదిలిన ఓపెన్ ల్యాండ్ అంతా భూతద్దం పెట్టి వెతికిన అంగుళం జాగా కూడా  కనపడదు.

ఆ జాగా అంతా  ప్రస్తుతం కాగితాలకు మీదనే ఉంది....క్షేత్రస్థాయిలో చూస్తే అట్టి ఓపెన్ ల్యాండ్ అంతా నిర్మాణాలను వెలిశాయి.ప్రజా అవసరాలకు వదిలిన 10శాతం భూములను రియల్ మాఫియా కబంధహస్తాల్లో చేరాయి. కార్పొరేషన్ పరిధిలో వివిధ డివిజన్లో ప్లాట్లు కొని ఇల్లు నిర్మించుకున్న కాలనీవాసులు అన్యకాంతమైన 10శాతం పార్కు స్థలాల కబ్జాలను కాపాడాలని అధికారులకు మొరపెట్టుకుంటే.... కార్పొరేషన్ అధికారులే వారి వైపు జాలిగా చూస్తూ వింత సమాధానాలు చెబుతున్నారు.  ప్రస్తుతం కార్పొరేషన్ లో ఆక్రమించుకున్న పార్కు స్థలాల మార్కెట్ విలువ రూ.300 కోట్లపై మాటే ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు.