కాంగ్రెస్‌వి విభజన రాజకీయాలు

10-05-2024 01:13:58 AM

అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్తారా?

రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర

కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు

రాజంపేట, మే 9: కాంగ్రెస్‌పై  ప్రధాని నరేంద్రమోదీ విమర్శల పర్వం కొనసాగించారు. దేశం అభివృద్ధి కోసం తాము రాత్రింబవళ్లు కష్టపడ్డామని చెప్పారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. ‘గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని వెన క్కి తీసుకెళ్లాలని చూస్తోంది. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని చూస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని చూస్తోంది. ఉచిత రేషన్ బియ్యం రాకుండా చేయాలని చూస్తోంది. రామ మందిరంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మారుస్తామని చెబుతోంది. రామమందిరానికి తాళం వేయాలని చూ స్తోంది.. మీరు వీటన్నింటినీ ఆమోదిస్తారా?’ అని మోదీ ప్రశ్నించారు. ప్రభుత్వం శక్తిమంతంగా ఉంటే.. దేశం శక్తిమంతంగా ఉంటుం దని, ఇప్పుడు అందుకే భారత్ బలంగా ఉందని పేర్కొన్నారు. 

మూలాలను మరిచిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని,  దేశ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం గురించి ఆ పార్టీకి అవగాహన లేదని మోదీ దుయ్యబట్టారు. ఆ పార్టీ మూలలను కాంగ్రెస్ మరిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎప్పుడూ దేశాన్ని ముక్కలుగా చూస్తుందని ఆరోపించారు. దేశ ఐకమత్యానికి విఘాతం కలిగించేలా ఆ పార్టీ నేతల మాటలు ఉంటాయని మండిపడ్డారు.