మహిళా ఎంపీలు 10 మందే!

10-05-2024 01:14:35 AM

తెలంగాణ చరిత్రలో అతి తక్కువ భాగస్వామ్యం 

ఇప్పటివరకు 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు

ఏడుచోట్ల మాత్రమే గెలిచిన మహిళా నేతలు

10 నియోజకవర్గాల్లో వారికి దక్కని ప్రాతినిధ్యం

2024 ఎన్నికల్లో అయినా ఎక్కువమంది గెలిచేనా?

1. సంగెం లక్ష్మీబాయి, 2. ఇందిరాగాంధీ

3. తేళ్ల లక్ష్మీకాంతమ్మ, 4. టంగుటూరి మణెమ్మ

5. టి.కల్పనాదేవి, 6. రేణుకా చౌదరి

7.చెల్లమల్ల సుగుణ కుమారి, 8. విజయశాంతి 

9. కల్వకుంట్ల కవిత 10. మాలోత్ కవిత

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): అతివలు ఆకాశంలో సగం అని గొప్పగా చెప్పు కొంటాం కానీ.. అవకాశాల్లో మాత్రం వారి వాటా అంతంత మాత్రమే. ప్రస్తుతం కొన్ని రంగాల్లో వారి ప్రాతినిధ్యం పెరిగినా రాజకీయాల్లో మాత్రం అట్టడుగునే ఉంటున్నారు. మహిళా నేతలను రాజకీయ పార్టీలు అరకొరగానే ఆదరిస్తున్నాయి. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల చరిత్రలో 10 మంది మహిళలు మాత్రమే ఎంపీలుగా ఎన్నికవడం రాష్ట్రంలో వారి అవకాశాల దుస్థితికి అద్దం పడుతున్నది.

ఇప్పటివరకు 17 సార్లు లోక్‌సభకు ఎన్నికలు జరగ్గా.. రాష్ట్రం నుంచి పార్లమెంట్‌లో అడుగుపెట్టింది 10 మంది మహిళలే. ఇందులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఉన్నారు. ఆమె మెదక్ నుంచి ఒకసారి గెలిచారు. ఈ స్థానం నుంచి ముగ్గురు మహిళలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చింది. ఆ తర్వాతి స్థానంలో ఖమ్మం ఉంది. ఖమ్మం నుంచి ఇద్దరు, పెద్దపల్లి, నిజామాబాద్, మహ బూబాబాద్, సికింద్రాబాద్, వరంగల్ నుంచి ఒక్కరు చొప్పున మహిళలు గెలిచారు. 

ఎవరు.. ఎక్కడి నుంచి గెలిచారు?

ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల నుంచి మహిళలు పోటీ చేస్తున్నా.. వారి గెలుపు అవకాశాలు చాలా తక్కువేనని గణాంకాలు చెప్తున్నాయి. తెలంగాణలో అత్యధికంగా మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మెదక్. 1967లో కాంగ్రెస్ నుంచి సంగం లక్ష్మీబాయి, 1980లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, 2009లో విజయశాంతి ప్రాతినిథ్యం వహించారు. ఖమ్మంలో 1962, 1967, 1971 ఎన్నికల్లో తేళ్ల లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1999, 2004లో రేణుకా చౌదరి విజయం సాధించారు.

1989 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం టంగుటూరి అంజయ్య సతీమణి టంగుటూరి మణెమ్మ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 1984లో వరంగల్‌లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీ కల్పనాదేవి విజయం  సాధించారు. 1998, 1999లో టీడీపీ నుంచి పోటీ చేసిన చెల్లమల్ల సుగుణ కుమారి పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2014లో నిజామాబాద్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత గెలిచారు. 

2024లో ప్రాతినిథ్యం పెరిగేనా?

2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి ఐదుగురు మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. బీఆర్‌ఎస్ తరఫున నిజాబామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత.. బీజేపీ తరఫున మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, నాగర్‌కర్నూలు నుంచి బంగారు శ్రుతి.. కాంగ్రెస్ తరఫున ఖమ్మం నుంచి రేణుకా చౌదరి పోటీ చేశారు. వీరిలో మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత మాత్రమే గెలిచారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ఆరుగురు మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా ముగ్గురు ఉన్నారు. బీజేపీ నుంచి ఇద్దరు, బీఆర్‌ఎస్ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఆత్రం సుగుణ, మల్కాజిగిరిలో పట్నం సునీత, వరంగల్‌లో కడియం కావ్యను కాంగ్రెస్ బరిలోకి దించింది. హైదరాబాద్‌లో మాధవీలత, మహబూబ్‌నగర్‌లో డీకే అరుణకు బీజేపీ టికెట్ కేటాయించింది.

మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ నుంచి మాలోత్ కవిత పోటీ చేస్తున్నారు. ఈసారి పోటీలో బలమైన అభ్యర్థులు ఉండటంతో లోక్‌సభలో తెలంగాణ నుంచి మహిళలకు ప్రాతినిధ్యం పెరుగుతుందా? ఇద్దరికి మించి గెలిచి.. 1967 రికార్డు బద్దలుకొడతారా? సంప్రదాయం ప్రకారం ఒకరు మాత్రమే గెలుస్తారా? అనేది వేచిచూడాలి.

మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తే..

ఇప్పటివరకు హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, భువనగిరి, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, జహీరాబాద్ స్థానాల నుంచి ఒక్క మహిళ కూడా ప్రాతినిథ్య వహించలేదు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగ్గా.. అంతకుముం దు ఉన్న సిద్దిపేట, మిర్యాలగూడ, హన్మకొండ లోక్‌సభ స్థానాల్లో మహిళలు గెలవలేదు. కొన్ని స్థానాల్లో మహిళలకు పోటీచేసే అవకాశం కూడా రాలేదు. అయితే మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తే మహి ళలకు సీట్ల కేటాయింపు పెరుగుతుందని, తద్వారా చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

రాష్ట్రంలో ఓటర్ల వివరాలు

మొత్తం ఓటర్లు : 3,30,21,735

మహిళలు : 1,65,87,221

పురుషులు : 1,64,31,777