04-09-2025 11:10:06 PM
నిత్యం ప్రమాదాలు.. చోద్యం చూస్తున్న పోలీసులు.
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ పట్టణం నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడంలో పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైందని ఆరోపణలు వినబడుతున్నాయి. గురువారం రాత్రి కొత్తగూడెం వైపు నుండి భద్రాచలం వైపు వెళ్లే ద్విచక్ర వాహనం పాల్వంచ బస్టాండ్ సెంటర్లో అతివేగంగా వచ్చి మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని డివైడర్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. రోజు రోజుకుపాల్వంచలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈనెల రెండవ తేదీన సెంట్రల్ లైటింగ్ పోల్ను ఢీకొన్న ఘటన అర్ధరాత్రి జనసంచారం లేని సమయంలో జరగడంతో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. 3వ తేదీ రాత్రి సూపర్ లగ్జరీ బస్సు పాల్వంచ బస్టాండ్ లోపలికి వెళ్లేందుకు యూటర్న్ తీసుకోగా అతివేగంగా వచ్చిన ట్రక్ ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన లో కూడా ప్రాణాపాయం సంభవించలేదు.
గురువారం రాత్రి 8 .30 గంటల సమయంలో అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం మరో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటన లన్నీ బస్టాండ్ సెంటర్లో జరగడంతో ఈ ప్రాంతంలో రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రమాదాలు నివారించాల్సిన అవసరం ఎంతో ఉందని రోడ్డు ప్రమాదాలు నివారించాలని పలు శాఖల అధికారుల ఆధ్వర్యంలో ర్యాలీలు మీటింగులు నిర్వహిస్తున్నారు. నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను విస్మరిస్తున్నారని విమర్శలు వెలబడుతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు మేనమేషాలు లెక్కిస్తున్నాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు నివారించేందుకు అసలు శాఖలు ఉన్నాయా ? అనే అనుమానాలు తలెత్తుతున్నట్లు పట్టణ ప్రజలు అనుమానాలను గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు సంభవించ కుండా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటారా? మీ చావు మీరు చావండని నిమ్మకుంటారా వేచి చూడాలి మరి.