21-08-2025 12:23:56 AM
-కీలక అధికారుల ముందే..
-తక్కువ పడ్డాయంటూ పోలీసుల బాహాబాహీ
నిఘా విభాగం, ఆగస్టు 20: అది నల్లగొండ జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్. ఆ పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ పండుగను పోలీసులు నిర్వహించారు. ఈ క్రమంలో సంప్రదాయం ప్రకారం ఆ పండుగ తంతులో భాగంగా మటన్తో విందు ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలోనూ పోలీసులు సంప్రదాయాలు పాటించి పండుగ నిర్వహించడం వరకు బాగానే ఉంది.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సదరు పండుగ తంతు కోసం స్పాన్సర్లు రెండు పొట్టేళ్లను, 5 కేజీల చేపలను అందించినట్టు సమాచారం. ఆ విందులో భాగంగా భోజనం వడ్డించే సమయంలో పోలీసుల మధ్య మటన్ ముక్కలు, మందు సుక్క తక్కువ పోశారంటూ వివాదం మొదలయ్యింది. అదికాస్త రచ్చగా మారింది. ఈ పండుగ తంతు కార్యక్రమానికి ఓ డివిజన్ స్థాయి పోలీసు అధికారితో పాటు కొంతమంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు సైతం హాజరయ్యారు.
వారి ముందే మటన్ ముక్కల కోసం, మందు సుక్క కోసం పోలీసులు బాహాబాహీకి దిగడం కొసమెరుపు. ఆ ఘటన కాస్త పోలీసు వర్గాల్లో గత రెండుమూడు రోజులుగా చర్చనీయాంశం అయ్యింది. పోలీసులై ఉండి.. మటన్ ముక్కలు, మందు సుక్క కోసం ఏకంగా పోలీసు స్టేషన్లోనే పంచాయితీకి దిగడం దారుణమనే చెప్పాలి.
పంచాయితీ పెట్టుకుని స్టేషన్కు వచ్చే సాధారణ ప్రజలకు బుద్ధి చెప్పాల్సింది పోయి.. పోలీసులే ముక్కల కోసం ఘర్షణకు దిగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలే కొంతమంది పోలీసుల వివాదాస్పద తీరుతో ప్రజల్లో అబాసుపాలవుతున్న పోలీసు శాఖ పరువు.. మటన్ ముక్కల వ్యవహారంతో బజారుకెక్కింది. ఈ వివాదం ఆ నోటా ఈ నోటా పాకి జిల్లా కేంద్రం వరకు చేరుకుంది. మరీ ఇంతకీ సదరు ముక్క పంచాయితీ వ్యవహారాన్ని ఏంజేస్తారో వేచి చూడాల్సిందే.