13-09-2025 12:42:55 AM
మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : పిరాయింపు ఎమ్మెల్యేలకు ఇక దింపుడు గల్లం ఆశే మిగిలిందని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయన్నారు. స్పీకర్ కు సమాధానంలో పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు.
రేవంత్ ను కలిసింది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే ఎవరు నమ్మే స్థితిలో లేరన్నారు. రేవంత్ కప్పింది పార్టీ జెండా కాదు.. జాతీయ జెండా అని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. వారి సమాధానం జాతీయ జెండాను అవహేళన చేయడమే అన్నారు. నమ్మిన పార్టీకి, ప్రజలకు ద్రోహం చేసిన ఎమ్మెల్యేలను ప్రజలు క్షమించరన్నారు. కెసిఆర్ పై నమ్మకమున్నప్పుడు నోటీసులు వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరకే రావాలి కానీ, రేవంత్ రెడ్డి ఇంటికేందుకెళ్లినారో సరైన సమాధానం చెప్పాలన్నారు.
రేవంతే కాదు వీళ్ళను ఎవరూ కాపాడలేరన్నారు. వాళ్ళను డిస్ క్వాలిఫై చేయడం ఖాయనన్నారు. ఉప ఎన్నికలు రావడం అనివార్యమని, ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్నారు. రాజకీయంగా శాశ్వతంగా బొంద పెడతారన్నారు. సమావేశంలో పలువురు టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.