calender_icon.png 16 July, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యామ్నాయం చూపకుండా షాపుల తొలగింపు సరికాదు

15-07-2025 10:54:34 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ సెంటర్లో చిరు వ్యాపారులకు షాపులు ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారులు, ఇప్పుడు ప్రత్యామ్నాయం చూపకుండా షాపులను తొలగించడం సరైన పద్ధతి కాదని, చిరు వ్యాపారుల పరిస్థితి రోడ్డున పడిందని మున్సిపల్ సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ సెంటర్లో కన్యకా పరమేశ్వరి దేవాలయం వైపు షాపుల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. రెండు గంటల పాటు పెద్ద ఎత్తున నిర్వాసితులతో కలిసి సిపిఐ నేతలు ఆందోళన నిర్వహించారు. చిరు వ్యాపారులు ఏళ్ళ తరబడిగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తుండగా, మున్సిపల్ అధికారులు పోలీసులు బందోబస్తుతో కూల్చడం వల్ల చిరు వ్యాపారాల భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆరోపించారు. ప్రత్యామ్నాయం చూపకుండా షాపులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చిరు వ్యాపారులకు నెల రోజుల్లో అక్కడే ప్రత్యామ్నాయం చూపిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.