calender_icon.png 16 July, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నక్సలిజం పెరగడానికి అధికారుల అలసత్వమే కారణం..!

15-07-2025 11:24:24 PM

పథకాలు అందుకోవడం కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసాగి అడవిబాట

రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగం పొందిన వారు కూడా ఆ వర్గాలకు మేలు చేయకపోతే ఎలా

దిశ సమావేశంలో జిల్లాస్థాయి అధికారులపై నిప్పులు జరిగిన ఎంపీ మల్లురవి

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం అలసత్వం చూపుతున్నారని వాటి కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి సామాన్యులు, యువత అడవి బాట పడుతున్నారని కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే నక్సలిజం పెరిగిపోతుందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన దిశ సమీక్ష సమావేశంలో జిల్లా స్థాయి అధికారులపై ఆయన నిప్పులు చెరిగారు. బ్యాంకు సేవలు, జాతీయ రహదారులు, ఎస్సీ కార్పొరేషన్ , వివిధ సంక్షేమ శాఖల రుణాలు, విద్య, వైద్య గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, శిశు సంక్షేమం, పౌర సరఫరాలు, పరిశ్రమల శాఖల పనితీరుపై సమీక్షించారు.

ముందుగా బ్యాంకర్లు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు అంశాలపై చర్చించారు. దళిత బంధు ద్వారా 2020-21 ఏడాది జిల్లాకు 488 యూనిట్లు మంజూరు కాగా 111 రుణాలకు ఆయా బ్యాంకులకు సబ్సిడీ రిలీజ్ అయింది. కానీ 92 దరఖాస్తులు మాత్రమే గ్రౌండింగ్ చేయగా ఇంకా 16 దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయి . వీటికి ప్రధాన కారణం ఆయా శాఖల అధికారులు బ్యాంకర్లు కావడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకునేందుకు సహాయంగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వాల్సి ఉందని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సూచన మేరకు ఆయా బ్యాంక్ మేనేజర్లకు ఇచ్చిన టార్గెట్లు కూడా పూర్తి చేయడం లేదని ఆయా రుణాల కోసం రైతులు నిరుద్యోగులు బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించడం లేదని మండిపడ్డారు. సివిల్ స్కోర్ సాకులు చూపి మంజూరైన సబ్సిడీ రుణాలు కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

అదే రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలు పొందిన ఉద్యోగులు సైతం ఆ వర్గాలకు మేలు చేయకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నిరుద్యోగులు లబ్ధిదారులు ఆయా పథకాల లబ్ధి కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి అడవి బాట పట్టి అన్నలుగా మారుతున్నారని ఆ తర్వాత ఉద్యోగులను ఊర్లో కూడా తిరగనివ్వరంటూ హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో హాస్టల్లో అధికారులు పనిచేయడం లేదని ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కూడా సమయపాలన పాటించడం లేదని అత్యంత నిరుపేదలకు వైద్యం అందించడంలో చీదరించుకుంటున్నారని మండిపడ్డారు.

జాతీయ రహదారుల అనుసంధానంగా హైదరాబాద్ నుండి మన్ననూర్ వరకు నాలుగు లైన్ల నూతన రోడ్డు మంజూరు కోసం అధికారులు నివేదికలు పంపినట్లు పేర్కొన్నారు. మద్దిమడుగు మాచర్ల కృష్ణా నదిపై బ్రిడ్జి రోడ్డు నిర్మాణం పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. 44వ జాతీయ రహదారి అనుసంధానంగా భూత్పూర్ నుండి మన్ననూర్, మద్దిమడుగు  వరకు జాతీయ రహదారి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, జిల్లాను ముందుకు నడిపించడం చాలా ముఖ్యమని, ఈ మూడు రంగాలలో అభివృద్ధి సాధించేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని ఎంపీ మల్లు రవి తెలిపారు.