25-07-2025 02:41:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): రుతుపవనాలు వాతావరణ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు రెడ్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 12 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సాయంత్రం వరకు విరామం ఇచ్చి, రాత్రి 10 గంటల తర్వాత నగర వ్యాప్తంగా మళ్లీ భారీ వర్షం కురిసింది. దాదాపు 5 గంటల పాటు కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. తెల్లవారుజామున ఉద్యోగాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
హుస్సేన్ సాగర్‌కు వరద
ఎడతెరపిలేని వానలకు నగరంలోని హు స్సేన్‌సాగర్‌కు వరద కొనసాగుతున్నది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు హు స్సేన్‌సాగర్ పూర్తి స్థాయి జలమట్టం 513.41 మీటర్లుగా ఉంది. గరిష్ఠ జలమట్టం 514.75 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 513.18 మీటర్లుగా నమోదైంది. ఇదే సమయంలో ఇన్‌ఫ్లో 1,728 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 774 క్యూసెక్కులుగా నమోదవుతున్నది.