24-01-2026 12:21:34 AM
మున్సిపాలిటీలో...
మొత్తం వార్డులు 28
మొత్తం ఓటర్లు 53,403
పోలింగ్ కేంద్రాలు 76
చైర్మన్ రిజర్వేషన్ బీసీ జనరల్
బీసీ జనరల్‌కు పీఠం ఖరారు..
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరు!
షాద్‌నగర్, జనవరి 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో షాద్నగర్ పురపాలికలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చైర్మన్ పీఠం ఈసారి బీసీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తమ పట్టు నిలుపుకోవాలని చూస్తుండగా, అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ సతమతమవుతోంది. మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగురవేయగా, రెండోసారి బీఆర్‌ఎస్ అధికారాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ’హ్యాట్రిక్’ ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ హోదాలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. పట్టణంలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ పథకాల అమలుతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
అయితే, ఒకే వార్డులో నలుగురైదుగురు పోటీ పడుతుండటం పార్టీకి తలనొప్పిగా మారింది. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కసిగా ఉన్న గులాబీ దళం, మున్సిపల్ ఎన్నికల ద్వారా తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తోంది. సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తూ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. బిజెపిలో నాయకత్వ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. పట్టణంలో పార్టీ మూడు ముక్కలాటగా మారిందని, గ్రూపు రాజకీయాల వల్ల భవిష్యత్తు లేదనే అసంతృప్తితో మాజీ కౌన్సిలర్ కుమారుడు ఆకుల ప్రదీప్ కుమార్ వంటి వారు పార్టీకి దూరం కావడం ఆ పార్టీకి పెద్ద దెబ్బే... ఇలా ప్రతి పార్టీ మున్సిపల్ పీఠం కైవాసం చేసుకునేందుకు ఇప్పటి నుంచి ఎవరికివారు ఎత్తుగడలు వేస్తున్నారు.
రంగంలోకి ‘అంతర్గత’ సర్వేలు
ప్రస్తుతం ఓటరు నాడిని పట్టుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. కేవలం పార్టీ విధేయత మాత్రమే కాకుండా, వ్యక్తిగత ఇమేజ్, ఆర్థిక బలం, కుల సమీకరణాలే ప్రాతిపదికగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు ’ఆపరేషన్ ఆకర్ష్’ కూడా తెరపైకి వస్తోంది. మున్సిపల్ పీఠం దక్కించుకోవాలంటే కేవలం వార్డుల గెలుపే కాదు, కౌన్సిలర్ల ఐక్యత కూడా ముఖ్యం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు క్యాంపు రాజకీయాలకు కూడా సిద్ధమవుతున్నాయి. అభివృద్ధి మంత్రం జపిస్తున్న కాంగ్రెస్, పట్టు కోసం పరితపిస్తున్న బీఆర్‌ఎస్, అంతర్గత పోరులో చిక్కుకున్న బిజెపి.. ఈ త్రిముఖ పోటీలో షాద్నగర్ ఓటరు ఎటు మొగ్గు చూపుతారో వేచిచూడాలి.