calender_icon.png 29 January, 2026 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం

29-01-2026 12:57:08 AM

  1. బాబాయి స్ఫూర్తితో రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశం
  2. ఏకంగా ౮ సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
  3. ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు

ముంబై, జనవరి ౨౮: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ చెరగని ముద్ర వేశారు. రాజకీయాల్లో ఆయన ఎప్పుడూ అనూహ్యమైన నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన ఏకంగా నలుగురు ముఖ్యమంత్రుల వద్ద ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా సేవలందించారు. ఎప్పటికైనా తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నది తన చిరకాల వాంఛ. ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించడం విషాదం. బాబాయి ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ పెద్దన్న అనంతరావు కుమారుడే ఈ అజిత్ పవార్. 23 ఏళ్ల వయసులోనే (1982) అజిత్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. నాడు చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా సేవలందించారు.

1991లో పుణె జిల్లా కోఖూ బ్యాంకు చైర్మన్‌గా సేవలు అందించారు. 1991లో ఆయన బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొత్తంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న శరద్ పవార్ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించగా అజిత్ ఆయన బాటలోనే నడిచారు.

ఎన్సీపీలో కీలక నేతగా ఎదిగిన అజిత్ పవార్.. జాతీయ రాజకీయాల్లో ఆరితేరిన శరద్ పవార్ వద్ద పలుమార్లు ధిక్కార స్వరాన్ని వినిపించారు. 2004లో ఎన్సీపీ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చినప్పటికీ సీఎం పదవిని శరద్ పవార్ తమ మిత్రపక్షమైన కాంగ్రెస్కు ఇవ్వడాన్ని అజిత్ బహిరంగంగా వ్యతిరేకించారు. అనంతరం 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చిన్నాన్నతో విభేదించి.. భాజపాతో చేతులు కలిపారు.

అయితే, కొన్ని గంటలకే దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో మళ్లీ శరద్ పవార్ వద్దకే చేరుకున్నారు. అనంతరం ఉద్ధవ్ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమిలో పనిచేశారు. మహావికాస్ కూటమి ప్రభుత్వం 2022లో కూలిపోయిన అనంతరం అజిత్ మరోసారి అధినేతపై తిరుగుబాటు అస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో ఎన్సీపీ రెండు ముక్కలుగా చీలిపోయింది. అనంతరం అజిత్ పవార్ వర్గం మళ్లీ బీజేపీతో చేతులు కలిపింది.