29-11-2025 12:09:27 AM
-వేముల వర్సెస్ చిరుమర్తి మాటల యుద్ధం
- నవంబర్ నెలలో రాజకీయ విమర్శల వేడి
- గ్రామ పంచాయతీ ఎన్నికల కావడంతో మరింత వేడి
నకిరేకల్ నవంబర్ 28 (విజయ క్రాంతి): నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో రాజకీయ రణరంగం మొదలైంది అధికార, ప్రతిపక్ష నాయకుల మాటల యుద్ధం తార స్థాయికి చేరాయి. శివాలయం మొదలుకుని చీరల పంపిణీ వరకు,. హాస్పటల్ నుండి అభివృద్ధి వరకు మాటలు యుద్ధం కొనసాగుతున్నది. నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశంపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ దూషణలు మరింత వేడెక్కాయి. దీంతో నియోజకవర్గంలో చర్చలుగా జోరందుకున్నాయి.
నకిరేకల్ శివాలయంలో శివస్వాముల 20వ మండల పడిపూజ కార్యక్రమం ఊహించని రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆహ్వానం లేకపోయినా భక్తిశ్రద్ధతో కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కరపత్రంలో తమ పేరును ప్రచురించకపోవడంలో ఎమ్మెల్యే వీరేశం హస్తం ఉందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పవిత్ర స్థలమైన దేవాలయంలో రాజకీయాలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా సేవ చేసిన తనకు ఆహ్వానం లేకపోవడం బాధాకరమని రాజకీయాలలో హుందాతనం పరస్పర గౌరవం అవసరమని ఈ సందర్భంగా ఉద్బోధించారు. అధికారం శాశ్వతం కాదని విలువలే శాశ్వతం అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు చిరుమర్తి ఆరోపణలను తిప్పికొట్టారు.
ఆ పార్టీ సీనియర్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, గాదగోని కొండయ్య మాట్లాడుతూ గ్రామపంచాయతి ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ కార్ రేసింగ్ కేసును లింగయ్య రాజకీయ ప్రయోజనాల కోసం లాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దుర్వినియోగాలపై విచారణ చేపడతామని స్పష్టంగా చెప్పాం. బిఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో నమ్మకం లేకపోవడం వల్లనే జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు. చిరుమర్తి ఆర్థిక దుర్వినియోగాలను కప్పిపుచ్చుకునేందుకే విమర్శిస్తున్నారని ఆరోపించారు దేవాలయంలో రాజకీయాలు చేయడం సరికాదన్న చిరుమర్తి గతంలో ఆయన వ్యవహార శైలిని ప్రజలు మర్చిపోలేదని వ్యాఖ్యానించారు.
ఈ వాదోపవాదాల మధ్య 100 పడకల ఆసుపత్రి పనులపై లింగయ్య మరో విమర్శను ఎక్కు పెట్టారు. నకిరేకల్‌లో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు తన పర్యవేక్షణలో 80% పూర్తయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఆ పనులకు నేటికీ మోక్షం కలగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు అవసరమైన ఆసుపత్రిని కేవలం రాజకీయాల కోసం నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం” అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు చీరల పంపిణీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే వేముల వీరేశం ఘాటుగా స్పందిస్తూ, “కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆసుపత్రి కోసం అదనంగా 16 కోట్లు మంజూరు చేయించాం. లింగయ్య హయంలో నిర్మించిన భవనం ప్లాస్టరింగ్ తంతే ఊడిపోతుందని, నకిరేకల్ ప్రజలు వన్ సైడ్ గా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి 70 వేల మెజార్టీతో తనను గెలిపించిన లింగయ్య అహంకారం ఇంకా తగ్గలేదన్నారు.
రాజకీయాలలో ఉన్నవారు హుందాగా పనిచేయాలని తెలివి ఉన్న వారెవరు ఇలా ప్రవర్తించారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త ఆలస్యం అయిన నాణ్యతగా మహిళలు కట్టుకునే విధంగా చీరలు పంపిణీ చేస్తామని చెప్పాం. ఆ విధంగా తయారు చేసి ఇచ్చాం.. మీలాగా బటానీలకో, పుట్నాలకో కొనలేని చీరలు మేము ఇవ్వలేదు. రాజకీయం నేను చేయట్లే. నువ్వు చేస్తున్నావు. ప్రజల మధ్య ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల మద్దతు పొందాలని హితవు పలికారు
ఈ నేపథ్యంలో మళ్లీ లింగయ్య ప్రతిస్పందిస్తూ “నేను 25 ఏళ్లుగా ప్రజా జీవితంలో సేవ చేస్తున్నా. నా వ్యక్తిత్వం గురించి ప్రజలందరికీ తెలుసు. దందాలు, బెదిరింపులు, భూమి కబ్జాలు చేస్తుందే వరో.. ప్రజలు గమనిస్తున్నారు. చేసిన అభివృద్ధిని ధ్వంసం చేసే సంస్కృతి నాకు లేదు. దమ్ముంటే ఎన్నికలకు రా... ప్రజలు ఎవరిని నమ్ముతున్నారో తేల్చుకుందాం” అని సవాల్ విసిరారు. నకిరేకల్ రాజకీయాలలో మాటల యుద్ధం ముదిరి ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. రెండు వర్గాల మధ్య ఆరోపణ, ప్రత్యరోపణలతో రాజకీయ వేడి ఎటు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.