22-12-2025 12:34:45 AM
యుద్ధానికి సిద్ధం అవ్వనున్న కౌన్సిలర్లు, చైర్మన్లు
పట్టణాల్లో మొదలవనున్న రాజకీయం
ఎల్లారెడ్డి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు దక్కించుకున్నప్పటికీ, ఫలితాలపై అంతర్గతంగా సమీక్షలు జరుగుతున్నాయి. తమకు లభించిన స్థానాల పట్ల బీఆర్‌ఎస్ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక భావన ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించిందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు పరీక్షగా ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వంలో.. ప్రజా ప్రభుత్వం.. పంచాయితీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తుంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు మెజారిటీ దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ జోష్లో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవునుంది. గ్రామీణ ప్రాంతాలే కాదు పట్టణ ప్రాంతాల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజా ప్రభుత్వానికి పట్టు ఉందని చాటి చెప్పేందుకు ఇదే మంచి సువర్ణ అవకాశం గా ప్రభుత్వం భావిస్తూ అన్ని అనుకూలంగా కుదిరితే జనవరిలోనే నూతన సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం కొనసాగుతుంది.
పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ దక్కనుందా..
మున్సిపల్ ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించింది. ఇందుకోసం ప్రత్యేకంగా జీవో 9 జారీ చేసింది. అయితే రిజర్వేషన్లు 50 శాతం కు మించరాదని పాత రిజర్వేషన్ ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని స్పష్టం చేసిన కోర్టులు.. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను నిలిపివేశాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆ నిధులు రాబట్టుకోవాలని నిర్ణయించిన ప్రజా ప్రభుత్వం పాత రిజర్వేషన్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మరో జీవో విడుదల చేసింది. మున్సిపల్ పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై నిర్వహించే ఎన్నికలు కావడంతో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో బీసీలకు పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించే ఒక నిర్ణయానికి వచ్చే ఆస్కారం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ముందుగా మున్సిపల్ ఎన్నికలు..
ముందుగా మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు ప్రచారం జరుగుతుంది. గతంలో మండల పరిషత్ ఎన్నికలు ముందుగా నిర్వహించి ఆ తర్వాత గ్రామపంచాయతీ ఎన్నిక లు నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం రిజర్వేషన్ల అంశం విషయంలో వాయిదా పడిన విషయం విధితమే. కాగా పార్టీ గుర్తులేని పంచాయతీ ఎన్నికలను ముందుగా నిర్వహించి వచ్చిన ఫలితాల ఆధారంగా పరిషత్ ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అధిక సంఖ్యలో పార్టీ మద్దతుదారులు గెలుపొందడంతో ఇదే జోష్లో పట్టణాల్లోని మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.