22-12-2025 01:58:31 AM
సాధారణ, ఏసీ, ఏసీలకు వర్తింపు
215 కి.మీ దూర ప్రయాణాల టికెట్ ధరలు యథాతథం
600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
26 నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: టికెట్ ధరలను స్వల్పంగా పెంచుతూ భారతీయ రైల్వేశాఖ ప్రకటన చేసింది. పెరుగుతున్న ఖర్చులను సమతుల్యం చేస్తూనే.. ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజా మార్పుల ప్రకారం.. లోకల్, స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆర్డినరీ క్లాస్‌లో 215 కి.మీల కంటే తక్కువ దూరం ప్రయాణికులకు ఎలాంటి ఛార్జీలు పెంచలేదు.
అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే.. ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటరకు 1 పైసా చొప్పన పెంచింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ ఏసీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటరకు 2పైసలు చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్-ఏసీ ట్రైన్లో 500 కి.మీ దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో రైల్వేకు దాదాపు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది.
ఆదాయ పెంపు మార్గాల్లో భాగంగానే..
గడచిన దశాబ్దకాలంలో రైల్వే శాఖ తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేసిందని, అందుకు అనుగుణంగా మానవ వనరుల శక్తి పెంచుకోవాల్సి ఉందని పేర్కొంది. ఆదాయం కూడా అవసరమని రైల్వే శాఖ తన ప్రకటనలో పేర్కొంది. 2024 జీతాలు, ఇతర ఖర్చుల రూపేణా రూ.1.15 లక్షల కోట్లు చెల్లించగా, రూ.60 వేల కోట్లతో పెన్షన్లు చెల్లించామని, మొత్తంగా రూ.2.63 లక్షల కోట్ల వ్యయం అయిందని రైల్వే శాఖ వివరించింది. ఆదాయ పెంపు మార్గాల్లో భాగంగా ప్రయాణికులపై చార్జీలు పెంచడంతో పాటు సరుకు రవాణాను అధికం చేయడంపైనా దృష్టిసారిస్తున్నామని వివరించింది.