calender_icon.png 15 October, 2024 | 11:30 PM

రేపు మదర్ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికకు పోలింగ్

12-09-2024 01:11:06 AM

ఆధిక్యత కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోటీ

యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు 11 (విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పాల ఉత్పత్తిదారుల నుంచి పాలను సేకరించి హయత్‌నగర్ కేంద్రంగా పాల ఉత్పత్తుల విక్రయాలు సాగించే సహకార రంగంలోని మదర్ డెయిరీ (నార్ముల్) డైరెక్టర్ల పదవుల ఎన్నికకు రేపు (శుక్రవారం) పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. మొత్తం 15 మంది డైరెక్టర్లు గల పాలకమండలిలో గతేడాది ముగ్గురు పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో, ఈ ఏడాది మరో మూడు డైరెక్టర్ల పదవులను భర్తీ చేయడానికి 13న పోలింగ్ నిర్వహించనున్నారు.

ఈ మేరకు రెండు పార్టీలకు చెందిన 12 మంది బరిలో ఉన్నారు. రెండు ఉమ్మడి జిల్లాల్లోని 23 మిల్క్ చిల్లింగ్ సెంటర్ల పరిధిలోని 297 ప్రాథమిక పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘాల చైర్మన్లు ఈ ఆరుగురు డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. కొత్తగా ఎన్నికకానున్న డైరెక్టర్లు, ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతున్నవారు కలిపి మొత్తం 15 మంది డైరెక్టర్లు కలిసి మదర్ డెయిరీ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.

అయితే, నల్లగొండ జిల్లాలో రాజకీయంగా అత్యంత కీలకమైన మదర్ డెయిరీ చైర్మన్ పదవిని ప్రస్తుత బీఆర్‌ఎస్ చేతిలో నుంచి ఎలాగైనా కైవనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తుండగా, తమ నుంచి చైర్మన్ పదవి జారిపోకుండా బీఆర్‌ఎస్ నాయకులు కృషి చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.

కాంగ్రెస్ తరఫున ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సొసైటీ చైర్మన్లను ఇప్పటికే క్యాంపునకు తరలించగా, బీఆర్‌ఎస్ తరఫున డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తమ మద్దతుదారులతో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా,ప్రత్యర్థి క్యాంపులోని చైర్మన్ల ఓట్లు రాబట్టుకోవడానికి ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది.