20-01-2026 02:19:06 AM
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో సింగరేణి టెండర్ల కుంభకోణం, సీఎం, మంత్రుల వాటాల పంచాయితీలు చూస్తున్నామని, సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం లేకుంటే ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఈ అవినీతికి సంబంధించి దిమ్మదిరిగే విషయాలు బయట పెడుతున్నామని పేర్కొన్నారు.
సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. కాంట్రాక్టు సైట్ విజిట్ పద్ధతి నైనీ బ్లాక్‌లో పెట్టామని, అందువల్ల నైనీబ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారని, కానీ కాంట్రాక్టు సైట్ విజిట్ పద్ధతి మన రాష్ర్టంలోనే కాదు.. దేశంలో ఎక్కడా లేదన్నారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక 2024లో సైట్ విజిట్ విధానం తెచ్చారని, ఈ విధానం వచ్చాక మొదటి లబ్ధిదారు రేవంత్ బామ్మర్ది సృజన్‌రెడ్డి అని ఆరోపించారు. ఆయన కంపెనీ శోధా కన్‌స్ట్రక్షన్‌కే ఈ సర్టిఫికెట్ వచ్చాక మొదటి టెండర్ దక్కిందని,
ఈ విధానం వచ్చాక సింగరేణిలో ఆరు టెండర్లు కూడా ప్లస్ 7 పర్సంటేజ్‌కి టెండర్లు వారి అనుయాయకులకు కట్టబెట్టారని స్పష్టం చేశారు. ఓబీ కోల్ బ్లాక్ టెండర్ దేశంలో ఎక్కడ జరిగినా మైనస్ 10 నుంచి మైనస్ 22 శాతానికి పోతుందని, రేవంత్‌రెడ్డి తీసుకొచ్చిన కొత్త విధానంతో అన్ని టెండర్లు ప్లస్ 7 నుంచి ప్లస్ 10 శాతానికి పోతున్నాయని తెలిపారు.
భట్టి విక్రమార్క కేవలం నైనీ టెండర్లు మాత్రమే రద్దు చేస్తాం అన్నారని, మరి మిగతా వాటి సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. సైట్ విజిట్ విధానంలో ముందే వెళ్లి సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాలని, ఎవరు ముందుగానే టెండర్ వేస్తున్నారో తెలుసుకొని, బెదిరించి, భయపెట్టి వారికి టెండర్ దక్కకుండా చేసి తమ అనుయాయకులకు ప్లస్ 7 నుంచి ప్లస్ 20 శాతానికి కట్టబెట్టి, కమీషన్లు కొల్లగొట్టారని ఆరోపించారు.
నైనీ బ్లాక్‌లోనూ ఇదే జరగడంతో వాటాల పంచాయితీ వచ్చి కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ బ్లాక్‌లో లేని విధానం సింగరేణిలో ఎందుకు అనే దానిపై అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
హౌలా మాటలు బంద్ చేయాలె..
సీఎం రేవంత్‌రెడ్డి హౌలా మాటలు బంద్ చేసి, ఆరు గ్యారెంటీల మీద దష్టి పెట్టాలని హితవు పలికారు. క్యాబినెట్ పెట్టుకుని రైతుబంధుపై, ఎరువుల కొరతపై, ఫీజు రీయింబ ర్స్‌మెంట్ బకాయిల గురించి చర్చలేదన్నారు. రాజీవ్ గాంధీ అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యను అవమానిస్తే టీడీపీ పుట్టిందని, ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ పెట్టారు కదా అని గుర్తు చేశారు.
‘తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్‌కు వ్యతిరేకం. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యం’ అని ఎన్టీఆర్ ప్రతిన బూనారని తెలిపారు. అంత ప్రేముంటే తెలుగుదేశంలో ఉండాల్సిందని, ‘టీడీపీ నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేశావ్’ అని విమర్శించారు. కాంగ్రెస్ బూస్థాపితమైతే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరుతుందని, నాలుగు ఓట్ల కోసం తెలుగుదేశం కోసం మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్, దేశం మొత్తం.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే, నువ్వేమో బీజేపీ, చంద్రబాబుతో కలిసి ఉంటవ్’అని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఔట్ సోర్సింగ్ సీఎంవు, అసలైన కాంగ్రెస్ లీడర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందన్నారు. సైట్ విజిట్ విధానం తప్పు అని నైనీ టెండర్లు రద్దు చేశారని, అదే విధానంలో జరిగిన ఆరు టెండర్లు రద్దు చేయాలని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ వీర విధేయుడిని అని చెప్పుకునే భట్టి, టీడీపీ మీద ప్రేమ చూపే రేవంత్‌రెడ్డి ఇద్దరూ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారేనని స్పష్టం చేశారు. అన్ని విషయాలూ బయటపెడుతాం అన్న మాటకు కట్టుబడి అన్ని వివరాలు బయట పెట్టాలని భట్టిని కోరారు. కాంగ్రెస్ బొగ్గు స్కాంపై న్యాయస్థానాలకు సైతం వెళ్లి కొట్లాడుతమని స్పష్టం చేశారు.
క్యాబినెట్ దండుపాళ్యం ముఠా కాదా?
క్యాబినెట్ దండుపాళ్యం ముఠా అంటే నా మీద పడ్డారని, సింగరేణి టెండర్ల విషయంలో సీఎం, భట్టి, కోమటిరెడ్డి మధ్య వాటాల పంచాయితీ కాదా అని నిలదీశారు. మధ్యలో ఐఏఎస్, జర్నలిస్టులు బలి పశువులు అయ్యారని, తన్నుకు చచ్చింది నిజం, వాటాల కోసం కొట్టుకున్నది నిజం.. ఇందులో జర్నలిస్టులు, ఐఏఎస్‌లు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. గతంలో దక్కన్ సిమెంట్స్ యజమానిని సీఎం ఇంటికి ఎదురుగా గెస్ట్ హౌస్‌లో తుపాకీ ఎక్కుపెట్టి పైసలు వసూలు చేశారని, సీఎం సన్నిహితుడు రోహిన్‌రెడ్డి కూడా ఇందులో ఉన్నారని మంత్రి కుమార్తె చెప్పిందని గుర్తు చేశారు.
వ్యాపారవేత్తలను బెదిరించి సంపాదించుకున్న డబ్బును పంచుకోవడంలో వాటాల పంచాయితీ నడుస్తోందన్నారు. సమ్మక్క సారక్క టెండర్లు దక్కలేదని పొంగులేటి, టెండర్లు దేవాదాయ శాఖ నుంచి ఆర్‌అండ్‌బీకి మార్చి టెండర్లు దక్కించుకున్నారని, హాలోగ్రాం టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి మధ్య ఐఏఎస్ బలి అయ్యారని, సంతకం పెట్టకముందే సినిమా జీవోలు వస్తున్నాయ్యని కోమటిరెడ్డి అన్నారని..
ఇన్ని పంచాయితీలు ఉన్నాయని తెలిపారు. ఆరు గ్యారెంటీలు అటకెక్కినాయని, వాటాలా పంచాయితీలు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ రూ.8 కోట్ల కోసం కాంట్రాక్టర్‌నే బెదిరించారని, కాంట్రాక్టరే స్వయంగా పోలీసు డిపార్ట్‌మెంట్‌కు కంప్లుంట్ ఇచ్చారని గుర్తు చేశారు.
దమ్ముంటే సీబీఐ విచారణకు అనుమతించాలి
గతంలో ఇదే సింగరేణిలో ఉన్న టెండర్లు రద్దు చేసి, వాటినే తమ అనుయాయులకు కట్టబెట్టారు. ఎస్‌ఆర్‌పీ ఓసీ టూ విస్తరణ 2025 టెండర్ మూడు సార్లు వాయిదా వేశారని, డీల్ సెట్ కాక మళ్లీ వారి అనుయాయులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి గతంలో బల్క్‌లో ఐఓసీఎల్ నుంచి సరఫరా చేసేవారని, కానీ పర్సెంటేజీల కోసం డీజిల్‌ను కూడా కాంట్రాక్టర్లకు అప్పగించారని, కమీషన్ల కోసం సింగరేణి ఇచ్చే డీజిల్ విధానం రద్దు చేశారని మండిపడ్డారు.
చేసిన పని మీదనే కాదు, డీజిల్ కలుపుకొని జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని, ఇది సంస్థకు నష్టం కాదా అని ప్రశ్నించారు. ఇదంతా ముఖ్యమంత్రి దగ్గరి సన్నిహితులు, సమీప బంధువు కనుసన్నల్లో జరుగుతున్నదని, ఎవరికి సర్టిఫికెట్ రావాలన్నా, టెండర్ రావాలన్నా వారి ఆదేశం లేనిదే దక్కదని ఆరోపించారు. చీటికి మాటికి సిట్ అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి నిజాయితీ, దమ్ముంటే సీబీఐ విచారణకు అనుమతించాలని సవాల్ చేశారు.
రెండేళ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ సీఎండీ లేరని, ఇన్‌ఆచార్జిని పెట్టి ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ లేదంటూ నైనీ టెండర్ రద్దు చేశారని, కానీ అన్ని టెండర్లు రద్దు చేయాలని, సింగిరేణికి సీనియర్ అర్హత కలిగిన సీఎండీని పెట్టాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ గద్దెల జోలికి వస్తే దుమ్ము దుమ్మే..
బీఆర్‌ఎస్‌ను, జర్నలిస్టులను వేధించడానికి సిట్లు వేస్తున్నారని, కాకీ బుక్కు అందరికీ సమానం అనే డీజీపీ శివధర్‌రెడ్డి ‘మీ ఖాకీ బుక్కు కాకీ ఎత్తుకుపోయిందా’ అని ప్రశ్నించారు. సజ్జనార్ జర్నలిస్టులను బెదిరించారు కదా? ఏమైంది హూంకరింపు. ఇవన్నీ కనిపించడం లేదా అని నిలదీశారు. ఇదొక దండుపాళ్యం ముఠా లెక్క అయిందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను తయారు చేస్తే, కాంగ్రెస్ రాగానే బెదిరింపులు, భూ కబ్జాలకు కేంద్రంగా మారిందన్నారు.
రేవంత్‌రెడ్డికి తెల్వకుండా సిట్ ఎలా వస్తుందని, రేవంత్‌రెడ్డికి తెల్వకుండా సిట్ వస్తే ‘ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్ అయినట్టే కదా’ అని ప్రశ్నించారు. ‘మీరు సర్కార్ నడుపుతున్నరా, సర్కస్ నడుపుతున్నరా’ అని నిలదీశారు. బీఆర్‌ఎస్ గద్దెలపై రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ‘బీఆర్‌ఎస్ జెండా గద్దె జోలికి వస్తే మీ గద్దె కూలుతుంది.. జాగ్రత్త బిడ్డా..’ అని హెచ్చరించారు. దుమ్ము దుమ్ము అయిపోతవు రేవంత్‌రెడ్డి అని హెచ్చరించారు. ‘మీరు కూలిస్తే కూలిపోవడానికి బీఆర్‌ఎస్ పార్టీ జెండా.. గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నదని, తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు.