05-12-2025 12:00:00 AM
స్పెషల్ ఫండ్ నిధులు గంగపాలు
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలోని రోగులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు వీలుగా ఉన్న కిచెన్ షెడ్ మరమ్మత్తు పనులు పూర్తిగా నాసిరకంగా కొనసాగుతున్నాయి. ఆస్పత్రి వైద్యుల కొరకు నిర్మించిన క్వార్టర్స్ ప్రస్తుతం కిచెన్ షెడ్డు కు ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కిచెన్ షెడ్ పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా మరమ్మత్తు పనులకై స్పెషల్ ఫండ్ నుంచి తొమ్మిది లక్షల నిధులు మంజూరైనట్లు తెలిసింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా నాసిరకమైన వస్తువులతో పనులు చేపట్టినట్లు విమర్శలు వస్తున్నాయి.
ఫ్లోరింగ్, గ్రానైట్ బండలు, విద్యుత్ పునరుద్ధరణ కోసం పైప్ లైన్, ఫ్యాన్, ట్యూబ్ లైట్స్, స్విచ్ బోర్డుల ఏర్పాట్లలో అన్ని వస్తువులు నాసిరకంగా వినియోగించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కిచెన్ షెడ్డులో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా అతి తక్కువ ధర కలిగిన నాసిరకమైన ఫ్యాన్లు ఏర్పాటు చేయడంతో నిధులన్నీ గంగలో పోసినట్లుగా మారుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
దాదాపుగా రిపేరు పనులు పూర్తి కావస్తున్నా సంబంధిత అధికారులు పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనపడుతోందని చెప్తున్నారు. డోర్లు కిటికీల ఏర్పాట్ల లోనూ పాత వాటికే మెరుగులు దిద్దినట్లు దర్శనమిస్తున్నాయి. దీనిపై జిల్లా జనరల్ ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ శేఖర్ ను వివరణ కోరగా వాటిని పరిశీలించి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.