calender_icon.png 17 September, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోషణ మాసం పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

17-09-2025 06:17:28 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పోషణ మాసం రోజువారీ కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ నిర్వహణపై సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య, గిరిజన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 8వ రాష్ట్రీయ పోషణ మాసం 2025లో భాగంగా అక్టోబర్ 16వ తేదీ వరకు రోజువారీగా నిర్వహించే కార్యక్రమాలను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని తెలిపారు. పిల్లలలో ఊబకాయం తగ్గించడం, శిశువులు, చిన్నపిల్లల ఆహార పద్ధతులు, పురుషుల భాగస్వామ్యం, స్థానిక పోషక ఆహార ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

వైద్య ఆరోగ్య, మహిళ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, ఇందులో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మహిళ సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. గర్భిణి స్త్రీలు, బాలింతలు, కిశోర బాలికలు, 6 సంవత్సరాల వయసు లోపు పిల్లలను పోషకాహార ఫలితాలను మెరుగుపరచాలని తెలిపారు. పోషణ మాసాన్ని నెల రోజులపాటు కార్యాచరణ ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని, అందరూ అధికారులు భాగస్వామ్యం కావాలని తెలిపారు. జిల్లా అధికారులు మండలాలలో పర్యటించే సమయంలో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.