17-09-2025 06:19:23 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): భూగర్భ జలాన్ని అభివృద్ధి చేసేందుకు వర్షపు నీటిని పొదుపు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో భూగర్భ నీటి వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నీటిపారుదల, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, ఉద్యానవన, గణాంక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకుని భూమిలో ఇంకెలా చర్యలు తీసుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని తెలిపారు.
జిల్లాలో వ్యవసాయ రంగానికి చెరువులు, కాలువలు, బావులు, బోరుబావుల ద్వారా సాగునీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. నీటి వనరుల శాఖ ఆధ్వర్యంలో నీటి పొదుపు పై ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలలో ఇంకుడు గుంతలు నిర్మించి నీటిని రక్షించి భూగర్భ నీటిమట్టాన్ని పెంపొందించాలని తెలిపారు. నీటి పొదుపుకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.