16-08-2025 12:13:15 AM
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయాక్రాంతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం యాదాద్రి జిల్లా ఎల్లారెడ్డిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణలో ఆయన మీడియా తో మాట్లాడారు. గతంలో పదవులు మీకే, పైసలు మీకేనా అని తాను చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించే చేశానని చెప్పడం సంచలన సృష్టిస్తోంది.
అయితే సీఎంపై విమర్శలు మునుగోడు ప్రజలకోసమేనని, తన మంత్రి పదవి కోసం కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఏనాడూ తాను విమర్శించలేదని చెప్పారు. తనకు మంత్రి పదవి అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, పదవి వస్తే ఎవరూ ఆపలేరు అని, ఆపితే ఊరుకోనని వ్యాఖ్యానించారు.
తనకు పదవి ఇవ్వకున్నా ఫర్వాలేదుగానీ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనతో పాటు తన నియోజకవర్గం మీద కూడా వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. మునుగోడు అభివృద్ధికి ఒక్క రూపాయైనా ఇవ్వడం లేదని మండిపడ్డారు.