calender_icon.png 19 August, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

18-08-2025 11:26:30 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సమన్వయంతో కృషిచేసి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్  ఎం.డేవిడ్ అన్నారు. సోమవారం  కలెక్టరేట్ లో ఆర్డీవో లోకేశ్వర్ రావు తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కాగజ్ నగర్ మండలం నజ్రల్ నగర్ కు చెందిన మీరా రాణి మండల్ తన పేరిట గల లావుని పట్టా భూమిని తన తమ్ముడు పట్టా చేసుకున్నందున విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మిత్ర సర్వీసెస్ మేనేజింగ్ పార్ట్నర్ కొండగుర్ల చంద్రశేఖర్ అవుట్ సోర్సింగ్ పోస్టులను సమానంగా కేటాయించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామానికి చెందిన రైతులు తమ గ్రామం గుండా నాలుగు వరుసల రహదారి ప్రక్కన ఖాళీ స్థలాలను ఆక్రమించుకున్నందున వ్యవసాయ చేనులో వస్తున్న వరద నీరు పోకుండా ఆగిపోవడంతో పంట నష్టం జరుగుతుందని, ఈ విషయమై తగు చర్యలు తీసుకొని ఆదుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జిల్లా కేంద్రంలోని జనకాపూర్ కు చెందిన ఒడ్డే పెంటన్న తన తండ్రి వాచ్ మెన్ గా విధులు నిర్వర్తిస్తూ మరణించినందున వారసత్వ ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జాడి పుల్లయ్య సాలెగూడా శివారులో అక్రమంగా పట్టా చేసిన వాటిని రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

ఆసిఫాబాద్ మండలం జెండా గూడ గ్రామానికి చెందిన కామెడీ నర్సింగ్ రావు తన పూర్వీకుల నుండి వచ్చిన భూమిని పట్టా చేసి పాసు పుస్తకాలు జారీ చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఆసిఫాబాద్ మండలం దస్నాపూర్ గ్రామానికి చెందిన పొన్నం పురుషోత్తం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.