19-08-2025 12:06:59 AM
-ఆర్టీఓలో అవినీతి మయం..
-చక్రం తిప్పుతున్న అధికారి..
-ఏజెంట్ల ద్వారా వసూళ్లు..
-ఫిట్‌నెస్‌కు రూ.10వేలు సమర్పయామి..
-కలెక్టరేట్ వెనుక అక్రమాల పర్వం
-పర్యవేక్షణ లేని పాలనే అసలు కారణం..
నల్లగొండ, ఆగస్టు 18(విజయక్రాంతి) : అది నల్లగొండ జిల్లా రవాణ శాఖ కార్యాలయం.. అక్కడ పనిచేసే ఓ అధికారి.. రవాణశాఖ కార్యాలయాన్ని కాస్త.. అవినీతి కార్యాలయంగా మార్చేశారు. అక్కడ ఏ పనిజరగాలన్నా.. పైసలియ్యాల్సిందే.. లేకుంటే ఫైల్ కదిలేదేలే.. ఉదయం ఖాళీ జేబుతో వచ్చి.. సాయంత్రానికల్లా దండిగా డబ్బులతో ఇంటికెళ్లాల్సిందే. లేకుంటే ఆ సారుకు నిద్రపట్టదు. దీంతో వాహనాల పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల జేబుకు చిల్లుపడాల్సిందే. ఇది చాలదన్నట్టు.. సాయంత్రం సమయంలో టైమ్ పాస్ కోసం రోడ్ల వెంట పడుతుంటారట ఆ అధికారి. దేనికోసం అనుకుంటున్నారా.. మరేందుకో కాదండీ.. ఆ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీలు చేస్తారు. ఆ తనిఖీల్లో భాగంగా ఓవర్ లోడు, పత్రాలు సరిగా లేవనే సాకుతో భారీగా డబ్బులు గుంజుతుండడం ఇటీవల అధికమయ్యిందట. నల్లగొండ రవాణ శాఖ కార్యాలయంలోని అవినీతి అధికారిపై ‘విజయక్రాంతి’ స్పెషల్ స్టోరీ.
పర్యవేక్షణ లోపమే అసలు కారణం..
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నల్లగొండ రవాణశాఖ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఏ ఫైల్ కదలాలన్నా.. డబ్బులు ముట్టజెప్పాల్సింది. నిజానికి నల్లగొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మొదటి నుంచి అవినీతి దందానే నడుస్తోంది. గతంలో జిల్లా రవాణ శాఖ అధికారులకు సంబంధించి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కనీసం పర్యవేక్షణ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది అవినీతిలో రెచ్చిపోతున్నారు.
వాస్తవంగా నల్లగొండ రవాణ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సదరు అధికారి ఆగడాలు రోజురోజూకీ ఎక్కువైపోతున్నాయి. నల్లగొండ జిల్లా రవాణ శాఖ కార్యాలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవ్వడంతో ఆ అధికారే కీలకంగా మారారు. దీంతో లైసెన్స్ మంజూరు, వాహనాల రిజిస్ట్రేషన్, వెహికల్ ట్రాన్స్‌ఫర్, వెహికల్ ఫిట్‌నెస్ తదితర పనుల కోసం వినియోగదారుల నుంచి రూ.వేలకు వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సదరు డబ్బును ఆ అధికారి నేరుగా వసూలు చేయకుండా అనధికారికంగా ప్రత్యేకంగా ఏజంట్లను నియమించుకోవడం గమనార్హం. సదరు ఏజెంట్లు తీసుకొచ్చిన ఫైల్స్‌కు ప్రత్యేక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఏలాంటి పని అయినా చకచకా జరిగిపోతుంటుంది. ఇది ఆ అధికారి ప్రత్యేకత అంటూ ఈ కార్యాలయంలోని సిబ్బంది గొణుక్కోవడం కొసమెరుపు.
కలెక్టర్ కళ్లేదుటే దళారి వ్యవస్థ
దళారులకు మాకు సంబంధం లేదు. వారిని కార్యాలయంలోకి అనుమతివ్వడం లేదని అధికారులు ఢంకా బజాయించి చెబుతున్నారు. కాని కార్యాలయం ఎదుట ఉన్న దాదాపు 35 దళారుల దుకాణాలు జనాలతో కిక్కిరిసి ఉంటున్నాయి. మరి వారు చేసే పనేంటని అడిగితే ఎవరి దగ్గర సమాధానం లేదు. దళారుల దగ్గరకు వెళ్లందే పని కావడం లేదని చాలా మంది ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రైవేటు స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ టెస్ట్ లోపభూయిష్టంగా జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి.
కొందరు ఆర్టీఏ సిబ్బంది డబ్బులు తీసుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా తరచూ పాఠశాల బస్సులు, వ్యాన్లు పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నాయి. కొందరు ముఠాగా ఏర్పడి మినీ వ్యాన్లు నడుపుతున్నారు. సిండికేట్‌గా మారి ధరలు నిర్ణయిస్తున్నారు. ఆరేడుగురు విద్యార్థులను కూర్చోబెట్టాల్సిన వ్యాన్లలో 10-12 మందిని కుక్కుతున్నారు. వాటిలో చాలా వరకూ ఫిట్‌నెస్ లేకుండా తిరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. 10-15 ఏళ్లు దాటిన వ్యాన్లను కొని రంగులు వేసి కొత్తవిగా చూపుతున్న పరిస్థితి నెలకొంది.
స్కూల్ బస్ ఫిట్‌నెస్‌లో భారీ అవినీతి..
పాఠశాలలు పున:ప్రారంభ సమయంలో సదరు అధికారి బిజినెస్ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుంది. అయితే నల్లగొండ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్సులను నడుపుతున్నాయి. అయితే ఏటా స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ రెన్యూవల్ చేయించాలి. అయితే ఫిట్ నెస్ కోసం వస్తున్న బస్సుల నుంచి సదరు అధికారి ఏకంగా రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారట. దీంతో మిగతా బస్సుల యాజమాన్యాలు.. అసలే ప్రైవేటు విద్యావ్యవస్థ ఆగమాగంగా మారింది.
దీనికితోడు సదరు అధికారి ఒక్కో స్కూల్ బస్సు ఫిట్ నెస్ కోసం రూ.10వేలకు పైగా డిమాండ్ చేస్తుండడం తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఆర్డీఓ కార్యాలయం వైపే రావడమే మానేశారు. నల్లగొండ జిల్లా రవాణాశాఖ పరిధిలో నమోదైన ప్రైవేటు స్కూల్ బస్సులకు.. ఫిట్ నెస్ చేయించుకున్న బస్సులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండడం కొసమెరుపు. ఎందుకంటే.. ఫిట్‌నెస్ కోసం వస్తే.. సదరు అధికారు ముక్కుపిండి వేలకు వేలు వసూలు చేస్తున్నారని జంకుతున్నారు. సదరు అధికారి వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సదరు అవినీతి అధికారిపై చర్యలు తీసుకుంటారో.. లేదో.. వేచిచూడాల్సిందే.