19-08-2025 12:04:19 AM
హైదరాబాద్, ఆగస్టు 18(విజయక్రాంతి): ఏటికేడు పెరుగుతున్న విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది. సంప్ర దాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారిస్తున్నది. ఇప్పటికే ‘తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025’ని సైతం ప్రకటించింది. ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో విస్తృతంగా సోలార్ ప్లాంట్లు ఏర్పా టు చేయాలని సంకల్పించింది.
దీనిలో భాగంగానే త్వరలో మార్కెటింగ్ శాఖ పరిధిలోని గిడ్డంగులు, గోదాముల రూప్‌టా ప్‌లపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నది. మార్కెట్ యార్డులు, గోదాముల్లో పంట నిల్వకు ప్రస్తుతం వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖలు విద్యుత్‌ను వినియోగించాల్సిన అవసరం, ఎక్కువగా విద్యుత్ ఖర్చు లు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఇప్పటికే సర్కార్ సంప్రదాయేతర ఇంధన వనరు ల (రెడ్కో) అనే నోడల్ ఏజెన్సీతో వ్యవసా య, మార్కెటింగ్‌శాఖలు సంప్రదింపులు జరిపాయి. తొలిదశలో కొన్ని మార్కెట్ యార్డులను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి, అక్కడ సోలార్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించాయి.
నాలుగు ఏఎంసీల ఎంపిక..
రాష్ట్రవ్యాప్తంగా 207 మార్కెట్ యార్డు లు, ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 180 వరకు గిడ్డంగులు, ప్రభుత్వాని చెందిన 120 గోదాములు ఉన్నాయి. సర్కార్ మొదటి విడతలో పైలట్ ప్రాజెక్టులుగా కూకట్‌పల్లి, వరంగల్, సూర్యాపేట, పెద్దపల్లి ఏఎంసీలను ఎంపిక చేసింది. ఈ ప్లాంట్ల నుంచి 50 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్లాంట్ల ఏర్పాటుపై ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సంబంధిత అధికారులతో సమీక్షలు సైతం నిర్వహించారు. మిగతా జిల్లాల నుంచీ నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ నెలఖారులోపు ప్లాంట్ల ఏర్పాటు అంశంపై తుది నివేదికలు అందుతాయని తెలిసింది.
సంప్రదాయేతర ఇంధన వనరుల లభ్యం..
దేశంలో విండ్ ఎనర్జీకి అవకాశం ఉన్న పది రాష్ట్రాల్లో జాబితాలో తెలంగాణ కూడా ఉన్నది. రాష్ట్రంలో 128 మెగావాట్ల విండ్ ఎనర్జీ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని ఇ ప్పటికే నిపుణులు తేల్చిచెప్పారు. మరోవైపు ఒక ఏడాదిలో 365 రోజులుంటే, సుమారు 300 రోజుల్లో సోలార్ ఉత్పత్తికి అవకాశం ఉందని తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,889 మెగావాట్ల మేర సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం.. వచ్చే మూడేళ్లలో 20,968 మెగావాట్ల వరకు పీక్ డిమాండ్ ఉంటుందని అంచనా వేసింది. దీంతో రాష్ట్రప్రభుత్వం వచ్చే పదేళ్లలో థర్మల్ పవర్ కంటే.. సోలార్ పవర్ ఉత్పత్తిని 26,374 మెగావాట్ల వరకు పెంచే దిశగా అడుగులు వేస్తున్నది.