19-08-2025 12:07:14 AM
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవకతవ కల్లో క్విడ్ ప్రోకో జరిగిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. హెచ్‌సీఏ అక్రమ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడారు. సీఐడీ దర్యాప్తులో చా లా విషయాలు వెలుగులోకి వస్తున్నా యని చెప్పా రు.
అన్ని రాష్ట్రాల అసోసియేషన్లు నిబంధనలు పాటించాలని బీసీసీఐ చెప్పినా కోర్టుల్లో కేసులు వేస్తూ హెచ్‌సీఏ అవకతవకలకు పాల్పడిందన్నారు. కమిటీల్లో మంత్రులు ఉండొద్దని సూచించినా బీసీసీఐ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సబ్ కమిటీలో కేటీఆర్ కొనసాగారని స్పష్టంచేశారు. కేటీఆర్ బంధువు అయిన రాజ్ పాకాలకు బీసీసీఐ టికెట్ల కాంట్రాక్టు ఇచ్చారని వెల్లడించారు. ఆడిట్ రిపోర్టులోనూ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.
పదేళ్ల నుంచి ఒకే ఆడిట్ రిపోర్టును ప్రతిసారీ కాపీ పేస్ట్ చేసి పాస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏటా క్లబ్బుల అభివృద్ధికి రూ.6.10 కోట్లు ఇస్తున్నారని, టీములు లేని క్లబ్బులకు కూడా డబ్బులు ఇచ్చారని వివరించారు. హెచ్‌సీఏ పరిపాలనా వ్యవహారాలకు కూడా నెలకు రూ.12 కోట్లు కేటాయించారని, నెలకు అంత డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.
కేటీఆర్ జోక్యం కారణంగానే ఇన్‌కం ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ బకాయిలను ఇష్టారీతిన మార్జిన్లతో సెటిల్ చేసినట్టు 2015 అర్షద్ అయూబ్ ఇచ్చిన రిపోర్టులో రికార్డు చేశారని గుర్తుచేశారు. టికెటింగ్ కాంట్రాక్ట్ 2019తో ముగిసిన తర్వాత కూడా 2017 నుంచి 2025 వరకు ప్రతి ఆడిట్ బుక్‌లో అదే కంపెనీకి రూ.12 లక్షలు చెల్లించినట్టు లేదా బకాయిగా చూపుతూ వస్తున్నారని వెల్లడించారు.
ఇటీవల సీఐడీ అరెస్ట్ చేసిన హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు ప్రభుత్వ సంస్థలకు చెందిన ఓటర్ల జాబితాను తారుమారు చేస్తూ ఎన్నికయ్యారని, ఇది కచితంగా ఎలెక్షన్ ఫ్రాడ్ అని మండిపడ్డారు. గత దశాబ్దంగా ప్రభుత్వ ఇన్‌స్టిట్యూషనల్ క్లబ్బులకు ప్రైవేట్ క్లబ్బుల కంటే నాలుగు రెట్లు అధికంగా మొత్తాలు ఎందుకు అందిస్తున్నారని ప్రశ్నించారు. పదేండ్ల ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేపట్టాలని టీసీఏ ఇప్పటికే సీఐడీకి లేఖ రాసినట్టు తెలిపారు.
చాలా క్లబ్బులు నకిలీగా ఉండగా, పాత క్లబ్బులను కొత్త ఫేక్ సొసైటీల పేర్లతో రీ-రిజిస్ట్రేషన్ చేసి రాజకీయంగా నియంత్రిస్తున్నట్టు అనుమానం వ్యక్తంచేశారు. 76 క్లబ్బులు బీసీసీఐ బైలాజ్ ప్రమాణాలను పూర్తి చేయలేదని, మొత్తం 155 క్లబ్బులు సస్పెన్షన్‌కు అర్హులన్నారు.
మూడింట రెండొంతుల క్లబ్బులు డమ్మీగానే ఉన్నప్పుడు, హెచ్‌సీఏను బీసీసీఐ నుంచి డిస్‌అఫిలియేట్ చేయాలని, హెచ్‌సీఏ సొసైటీని తెలంగాణ ప్రభుత్వమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని అవకతవకలకు బాధ్యులైన వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని, సీఐడీని కోరారు. తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి కోసం టీసీఏని బీసీసీఐలో ఫుల్ మెంబర్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు.