19-08-2025 12:29:35 AM
ఎల్బీనగర్ నియోజకవర్గంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటన
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో పురాతన రాచకాల్వ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. శివారు ప్రాంతాల్లో నూతన కాలనీలు నిర్మితం అవుతుండడంతో వరద కాల్వ కబ్జాకు గురవుతుంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న పెద్ద వరద కాల్వలో రాచకాల్వ ఒకటి. ఇబ్రహీంపట్నం చెరువు, తుర్కయంజాల్ లోని సాహెబ్ చెరువుకు వచ్చే నీళ్లన్నీ రాచకాల్వ నుంచే వస్తాయి. అయితే, కాల్వ కబ్జాకు గురవుతుండడంతో కాల్వను కాపాడాలని స్థానికులు అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
బీఎన్ నగర్ రెడ్డి డివిజన్ లోని సాహెబ్ నగర్ కలాన్ ప్రాంతంలో సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించి, రాచకాల్వను పరిశీలించారు. వెంకటేశ్వర కాలనీ, భావాన్నీ ఎన్ క్లేవ్, బృందావన్ మిడోస్ కాలనీ, గాయత్రి కాలనీ, బ్యాంక్ కాలనీ తదితర పరిసర కాలనీల్లో ఆయన రాచకాల్వను పరిశీలించారు. దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉన్న రాచకాల్వ కబ్జాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడంతో దాదాపు 30 కాలనీల ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. కాల్వను కాపాడుతామని, పూర్తి సర్వే చేసి, కబ్జాలను అడ్డుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.