23-12-2025 05:07:51 PM
పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో క్రిస్మస్ ముందస్తు వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. శివాజీ ఆడిటోరియంలో రంగు రంగుల గంటలు, నక్షత్రాలతో అందంగా అలంకరించి, క్రిస్మస్ కు వేడుకలకు ఉత్సాహభరితమైన, పండుగ వాతావరణాన్ని సృష్టించారు. హృదయపూర్వక స్వాగత వచనాలతో ఆరంభమైన వేడుకలు, ఆనందం, ఉత్సాహంతో నిండిపోయాయి. శ్రావ్యమైన క్రిస్మస్ గీతాలు పండుగ స్ఫూర్తిని ఆవిష్కరించి, ప్రేక్షకులను అలరించాయి. పలువురు గీతం విద్యార్థులు ఆత్మీయంగా పాడడంతో పాటు ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలు, ఆలోచనాత్మక నేటివిటీ దృశ్యం ప్రదర్శించారు. ప్రేమ, శ్రద్ధ, భాగస్వామ్యం, మంచితనాన్ని వ్యాప్తి చేయడం.. వంటివన్నీ కలగలిసి క్రిస్మస్ శోభను రెట్టింపు చేశాయి.
పండుగ దుస్తులు ధరించిన విద్యార్థుల ఉత్సాహం, ప్రకాశవంతమైన చిరునవ్వులు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి. మానవాళి కోసం యేసుక్రీస్తు జననం, త్యాగంపై దృష్టి సారించి, క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పేలా ఒక ఆకర్షణీయమైన ఆంగ్ల నాటకాన్ని ప్రదర్శించారు. దాని శక్తివంతమైన సందేశం, ఉత్సాహభరితమైన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వేడుకలలో మెరిసే నక్షత్రం, వెండి గంట, మిఠాయి కర్ర, పుష్పగుచ్ఛము, కొవ్వొత్తి, శాంతా క్లాజ్ వంటి క్రిస్మస్ ఆభరణాలు కనులు మిరిమిట్లు గొలపడంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శాంతా క్లాజ్ ఉల్లాసంగా ఆడిటోరియం అంతా కలియతిరుగుతూ, ప్రేక్షకులలో ఆనందాన్ని నింపుతూ, బహుమతులను పంపిణీ చేశారు.
కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ క్రిస్మస్ యొక్క నిజమైన సారాంశం, విలువలను హైలైట్ చేస్తూ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారు. ఈ వేడుకలలో గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, ఆంగ్ల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జోసఫ్ జయకర్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యతకు ప్రతీకగా క్రిస్మస్ కేకును ఆచారబద్ధంగా కట్ చేసి, తినుబండాలన్నింటినీ అందరికీ పంచడంతో ఈ వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాంప్ వాక్, ఆటలు విద్యార్థుల ప్రతిభకు గీటురాయిగా నిలిచాయి. మొత్తంమీద, ఈ ముందస్తు క్రిస్మస్ వేడుకలు బలమైన సమాజ భావనను పెంపొందించడంతో పాటు ప్రాంగణం అంతటా సామరస్యం, పండుగ ఉత్సాహాన్ని నింపాయి.