29-10-2025 12:00:00 AM
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నకిరేకల్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు వెళ్లేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని చీమల గడ్డ ప్రాంతంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమశాతం సరిగ్గా ఉండి తాలు, తరుగు లేకుండా ఉంటే తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ఎక్కడైనా హమాలీల కొరత ఉంటే ఎక్కువ మందిని ఏర్పాటు చేసి వెంటనే ధాన్యం మిల్లులకు వెళ్లేలా చూడాలని అన్నారు. ఎట్టి పరిస్థితులలో కొనుగోలు కేంద్రాలలో ఉన్న దాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు.
మొంతా తుఫాన్ దృష్ట్యా రైతులు వర్షాలు తగ్గేవరకు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా మిల్లర్లు, లారీల సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాల న్నారు. కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డిసిఓ పత్యా నాయక్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేష్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ , నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఉన్నారు.